కవిత్వం

The (this) moment of silence

సెప్టెంబర్ 2016

నిశ్శబ్ధంగా కూర్చున్నప్పుడు,
నీకు తోచినట్టుగా నిన్ను పోనిస్తాను.
మాట్లాడుకుంటూ, రాసుకుంటూ, మళ్ళీ నను చూసి నవ్వుతుంటే,
లోపల్లోపలే సంబరపడ్తాను.
నీకంటూ అవధులేం లేవని ఆనందిస్తాను.

కొండల మీదుగా, లోయలమీదుగా,
పచ్చపచ్చని పొలాల మీదుగా,
ప్రతీ సంధ్యలో ప్రయాణం చేస్తామా?!
బరువు, బాధ్యతల ఇరుకైన ఇంట్లో తలుపు నెమ్మదిగా తెరుచుకున్నట్లు,
చీకటినంతా ఎవరో ఖాళీ చేసినట్లు అనిపిస్తుంది.
దిక్కులుదాటి ఎగురుతున్నట్లు,
దిగంతరేఖని దాటుతున్నట్లు అనిపిస్తుంది.
సరిగ్గా అప్పుడే
నా గురించి, నీ గురించి, ప్రపంచం గురించి…
ఏదేదో గుర్తొస్తుందిగానీ
ఏదీ మాటగ మారదు.
నువ్వు నాకేమవుతావో,
నువ్వున్నందుకు నాకెలా ఉందో చెప్పాలని చూస్తాను.
కానీ ఒక్క పదమూ పలకదు.
వణుకుతున్న చేతులతో ఏదన్నా రాసి నీకు చూపిద్దామని ప్రయత్నిస్తానా?!
నువ్వు కనురెప్ప వేస్తూ చదువుతుంటే అది ఖాళీగా ఉందని తెలిసిపోతుంది.
పదాల్లేకుండానే నేను బాగా మాట్లాడవచ్చనీ,
కాగితాల్లేకుండానే రాయవచ్చని అనిపిస్తుంది.

మాటల్లేకుండా మనం కూర్చున్న వేళ-నిజం చెప్పనా?
నిన్నారాధించే పదాల కన్నా
నీకోసం ఆలాపించే మౌనం చాలా బాగుంటుంది.

Original: http://vaakili.com/patrika/?p=10759 -మంజీర