కవిత్వం

జతకూడిన సంగతి రాయకూడదనుకుంటాగానీ…

మార్చి 2017

తకూడిన సంగతి రాయకూడదనుకుంటాగానీ…

నీకు తెలిసుండదు. నువ్ రాగానే పొత్తికడుపులో ఒక చీకటిగుహ పొడుచుకువచ్చి, నువ్వందులోకి మెల్లిగా పాకుతూ వచ్చి… నిదురకు ఒరిగినట్టు, నీ నిద్రతో నా శరీరం నిండిపోయినట్టు…

ష్… రాత్రి జరిగింది రాస్తున్నా అనిపిస్తోందా? కాదు. కాదు. దాన్నెలా రాయాలో నిజంగా నాకు తెలీదు. కానీ నీ నాలిక గురించి, అక్కడా ఇక్కడా నువ్వు దాన్ని వొయ్యారంగ కదిపి చర్మం కింది ప్రతీ అణువుకి తాళం తీసిన సంగతి రాద్దామనిపిస్తోంది.

ఒకవేళ గాలి ఆడని ఇరుకైన బస్తీ అంతా, తెలవారకముందే ఇండ్ల తలుపులు తెరుచుకున్నాయని రాశానే అనుకో. ఎన్నో రాత్రులుగా బిగుసుకున్న కండరాలు తటిల్లున ఒక్కసారే వదులయినట్టు ఎవరికన్నా అర్ధమైపోతదా? ఏమో! క్లింట్ ఈస్ట్ఉడ్ పై ఒరిగిపోతున్న మెరిల్ స్ట్రీప్ లాగో, ప్రవరునికి ఎదురునిల్చున్న వరూధినిలాగో.. వశంకాని కోరికేదో లోపలినుండి సుడులు తిరిగి వీస్తుంటే, చీరని వదిలేసి నిలుచుండిపోయాను. అంతులేని వివశతకి అందినంతా సాయం చేసాను.. ఎముకల్లో ఎవరన్న పిల్లంగొయ్య ఊదుతుంటే గాలికి ఆమాత్రం దారివ్వక తప్పుతుందా?

మరే.. నీ చేతులగురించి కూడా చెప్పాలి. వేట నేర్చుకునే కుక్కపిల్లల్లా ఒళ్ళంతా గెంతులేసి, మట్టితవ్వి గుంతలు చేసి, దొరికిందల్లా పట్టి చూసి; ఒక్కో పొరలోంచి ఆనందాన్ని తోడి, సుతారంగా విదిల్చి కొట్టి…

..వెనకాలనుండి ఒత్తిపట్టే వేళ్ళకొసల స్పర్శకి ఎగబాకే రక్తాన్ని ఏమని రాయను? నిప్పు రేగిన చెకుముకి రాళ్లననా? పోనీ పొడ ఎండ తగిలిన పొద్దుతిరుగుళ్ల జత అనేస్తేనో!

పెదిమల్ని సైతం ఓపని ఒక ఉన్మత్త క్షణం చివర “మింగేస్తావు, జాగ్రత్త ” అని కూనిరాగంలో అరుస్తావు. భయపడేది నీకోసమా, నాకోసమా అడగాలనిపించి నవ్వుకుంటాను. పిలగాడా! అట్లా మందలిస్తే నువ్వు ముద్దొస్తావు. చినుకంత విరామం దాటి, నిన్నలాగే మళ్ళీ వేధిస్తూ ప్రేమించడం భలే బాగుంటది. నీ శంఖం, అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయినా పసివాడు అమ్మవచ్చి లాక్కునిపోవాలని కోరుకున్నట్టు ఉంటది. వీధిచివర బెదురుగా ఎదురుచూసినట్టు ఉంటది. నిన్ను ఎంగిలి చేయడం, గొంతులోకి నీ రహస్యాలు జారుతుంటే తేలిపోవడం గమ్మత్తుగా ఉంటది.

ఇంకేమీ లేదనుకునేవు. చెప్పలేను. నిదరంతా చెదరగొట్టిన తుఫాను వెలిసాక, నెమ్మదైన అలలు తగిలి చెదిరిన జుత్తు సర్దుకునేవేళ, మెడ ఒంపుని పొదువుకుంటావు చూడూ… అప్పుడైతే పడవ మునిగిపోకుండా లంగరు వేసినట్టు ఉంటది. సముద్రం మధ్యలోకి పోయిరాసరే, పర్లేదు; చివరికి నిన్నిక్కడే కట్టేసుకుంటానని పరధ్యానంగా పాడినట్టు ఉంటది.

***

Original: I DIDN’T EXPECT MYSELF TO WRITE ABOUT SEX by CYRIL WONG
అనుసృజన: నందకిషోర్

కైరిల్ వాంగ్(1977 – ): చైనీస్ వారసత్వానికి చెందిన సింగపూర్ కవి. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి ఇంగ్లిషు సాహిత్యంలో డాక్టరేటు తీసుకున్న ఇతను కన్ఫెషనల్ పొయెట్ గా, సంపాదకుడిగా, విమర్శకుడిగా సింగపూర్ సాహిత్య వేదిక మీద సుపరిచితుడు. గే పొయెట్‌గా పేరుపడ్దప్పటికీ తన కవితల్లోని సున్నితత్వం,తాత్వికత చెప్పుకోదగ్గవి.