కథ

కొంచం నిజం

అక్టోబర్ 2016

బ్బ… నిజం. పుట్టినపుడు కూడా ఇంత ఏడ్వలేదు. ఇందాక చెప్పాను కదా. అందర్ని ఆమెకోసం వదిలేసినందుకు ఆమె కూడా వదిలేసిపోయిందని. అంతే.

ఆ తర్వాత ట్యాక్సి వాడు మిగిలిన డబ్బులకోసం నానా తిప్పలు పెట్టాడు. నా జేబు ఖాళీ. అసలే వాడి తలనొప్పిరా దేవుడా అంటే మాటిమాటికి ఆ పోలిసోడి ఫోనొకటి. హ్మ్. నీకొచ్చిన ఆలోచనే నాకు వచ్చిందిలే. చివరికదే చేసా. ఆ సింకార్డ్ తీసి నా కొత్త ఫోన్ కాస్తా ఆ డ్రైవర్‌గాడి చేతిలో పెట్టి ఏ పాట పాడుతూ అడుక్కుంటే ఎక్కువ డబ్బులొస్తాయా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెనక్కి నడిచా.బై ద వే. ఈ గొడవకి ముందంతా మేం పాటలు పాడుకుంటూనే ఉన్నాం.

***

అంత సడన్‌గా ఏమైందనేనా? నిజాలు చెప్పొద్దు జనాలకి. నీకోసం ఉన్నా అంటే నీకోసమే ఎప్పటికీ ఉంటానని కాదు అని చెప్పావే అనుకో. చకచకా రైలెక్కడం , పోతూ పోతూ ఆ బాధని మొత్తం మనమీద వొంపేయడం, ఎటూ పోతున్నదీ చెప్పకుండా ఎప్పటికీ తలుచుకు చచ్చేలా ప్లాన్ చెయ్యడం. ఈ ఆడాళ్ళంతే! అప్పటికి మాత్రమే అది నిజమని తెల్సినా అలాంటి మాటలే కావాలాళ్ళకి.

***

లవ్యూ అని మెసేజ్ పంపింది నాకే సార్. కానీ- ఇష్టంకొద్దీ. ఇష్టమంటే ఇష్టమే. ప్రేమ కాదు. అమ్మతోడు. అంతే సార్. కొట్టద్దు సార్. మీ దండంబెడ్తా. నాకేం తెల్వదు సార్. నిజం సార్. ఫోన్ ఇప్పుడు లేదు చేతిల. అన్నీ మెసేజ్‌లు చూస్తే మీకే అర్ధమైతది. ఒట్టు సార్.

హలో భయ్యా. నేన్ స్టేషన్‌ల ఉన్ననె. జల్ది రావాల్నె. బాబాయ్ డిపార్ట్‌మెంటె కద. వీళ్ళకి ఒక్కసారి ఫోన్‌జేపియ్యవె. బాగా కొడ్తుండ్రె

హలో. హలో బాబాయ్. నేన్ జేసిందేం లేదు. ఆ. సంతకం ఏం పెట్టించుకోలె. సరెనె.

థ్యాంక్స్ బాబాయ్. దవడనొస్తుంది. గిదేముందిలె. కొంచెం రక్తం. తుడుసుకుంటె పోతది. ఒక్క ఛాయ్ తాగిపిస్తవ? తనకి నేనంటే చానా ఇష్టం బాబాయ్. తీస్కపొమ్మన్నప్పుడు నేను గదంతా ఆలోచించలె. రెండ్రోజులన్న మంచిగుంటదనుకున్న. తప్పు నాదె. ఏదన్నజేసి కేస్ లేకుండా చెయ్యి. కేస్ ఉన్నా పర్లే. నాన్నకి తెల్వకుండ మేనేజ్ చెయ్యి. ఇంట్ల ఇదంతా తెలిస్తె జన్మల ఇంటికిపోవుడు కుదరదు. ప్లీస్ బాబాయ్.. ప్లీస్..

***

“మై డియర్ పోయెట్. పువ్వులా నీ తలమీద రాలుతానంటే ఎందుకంత నొప్పి? తుంపరలా నీ మొహంమీద తన్నుతానంటే ఎందుకంత సిగ్గు? ఉడతలా నీ వీపు మీద పాకి మెడ నరం కొరుకుతానంటే, వెన్నెల కాంతితో నీ కళ్ళని చీలుస్తానంటే ఎందుకు భయంతో కళ్ళు దించుకుంటావ్? ఎందుకు భయంతో ఒళ్ళు దాచుకుంటావ్?”

“హి. హి. హి. నాకు వచ్చు ఇమేజరీలు. పిచ్చోడా! ఏట్లోకి పోతా. ఏం నీకు చెప్పాల్నా? ఈ రెండ్రోజులన్న నువ్వు పక్కన లేకపోతే ఈపాటికెప్పుడో”..

” నువ్వంది నాకు అర్ధమైందిరా. అంత కటువుగా చెప్పడమే నచ్చలె. నిన్ను చేతుల్లోకి తీసుకుంటా అని భయపడ్డావా? హత్తుకుందామనేగానీ, పట్టుకుని ఉండిపోయే”..

“సరే. ఇంక విసిగించను. నువ్ పొద్దున లేచేసరికి నీ పక్కనున్న చందమామ అకాశంలోకి ఎగిరిపోతది. నువ్వు నా సంతోషం. ఇంతకంటే అందంగా చెప్పడం నాకు చేతకాదు. లవ్యూ”!

***

ఫోన్ దొరికిందట. మనిషి లేదట. పాపం.
అటుదిక్కే నడుస్తున్నా. లేదనే అంటున్నరుగని, ఊహు.నన్ను దాటి ఎక్కడికి పోతది?

**** (*) ****