ముఖాముఖం

“నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి

మే 2017

నదైన భాషతో, వ్యక్తీకరణలతో కథలు రాస్తున్న యువ రచయిత. నిండా మూడు పదుల వయసు కూడా లేని వంశీ తన కథల్లో జీవితానికి సరికొత్త నిర్వచనాలిస్తారు. చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటమూ లేకుండా చెప్పేస్తారు. ఐస్ క్యూబ్, జిందగీ, చౌరస్తా, కీమోలాంటి కథలతో ఎవరేమనుకున్నాతన బాణీ, తన దారి ప్రత్యేకమని చాటుకున్నారు. తెలుగు కథకు సరికొత్త భరోసా కల్పిస్తున్న యువ రచయిత వంశీధర్ రెడ్డితో చందు తులసి జరిపిన ఇంటర్వ్యూ.

***

జిందగీ, వెడ్డింగ్ ఇన్విటేషన్, చౌరస్తా, ఐస్ క్యూబ్… ఇలా మీ కథలన్నీ చెప్పే తీరులో మీదైన ప్రత్యేకత, పట్టు కనిపిస్తుంది. అది ఎలా సాధించారు?

ఏ కథ ఐనా ముందు నాకు నేను చెప్పుకుంటాను. నాతో నేను మాట్లాడుకుంటాను, సంభాషణల దగ్గరినించీ విరామ చిహ్నాల దాకా. ఈ ప్రాసెస్ లోనే తెలిసిపోతుంటుంది ఆ అనుభవం కథగా మారదగిందేనా కాదా అని. ఆ తర్వాతే అది పేపర్ మీద రాసుకుంటాను యధాతథంగా. నేను రాసిన కథలన్నీ ఒక షార్ట్ టైమ్ ఫ్రేమ్ లో జరిగే సంఘటనలే. మహా ఐతే 36 గంటల్లో జరిగినవి ఉంటాయి. అంతకు మించవు. మీరన్నట్టు ఇదొకప్రత్యేకతో, పట్టో అనుకోను. ఇలా రాసుకోడం సౌకర్యంగా ఉంటుందంతే. రచయిత తన తెలివితేటలు బహిరంగపర్చుకోడానికి కాకుండా, పాత్రల తాలూకు అంతఃసంఘర్షణని ఎలాంటి ఫిల్టరేషన్ లేకుండా వ్యక్తీకరించేందుకు అనువైన భాషను సృష్టించుకోగలగాలి ఎప్పటికైనా.

మొదటి కథ ఎపుడు రాయాలనుకున్నారు? ఎందుకు రాయాలనుకున్నారు. మొదటి కథ రాసినప్పటి ఙ్ఞాపకాలు, అంతర్మథనం పంచుకోగలరా?

మొదటి కథ “చౌరస్తా” కినిగె లో ప్రచురితమైంది. 2010-11 లో ప్రత్యేకతెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో మిత్రుడు ఒకరు సమ్మెలో పాల్గొని జైలుపాలై కొన్నాళ్ళకు ఎలాగోలా విడుదలై (కేసు ఎత్తేయడానికి సంవత్సరంపట్టింది) మా ఊరి డిగ్రీ కాలేజిలోంచి తీసేయబడి, ఏం చేయాలో తెలీనిపరిస్థితుల్లో, పోలీస్ కేసుందని ఎక్కడా ఉద్యోగం దొరక్క, బతుకుదెరువుకు ఐ.పి.యల్ బెట్టింగులు చేయాల్సిన పరిస్థితుల్ని చాలా దగ్గర్నించిచూసాను. అది కేవలం ఓ అనుభవంగా మిగలడంకంటే ఓ చేదు జ్ఞాపకంగా గుర్తుపెట్టుకోడం మంచిదనిపించి. అది మా ఊరి కథ కాబట్టి నాకు తెలిసిన, నా మాండలికంలో రాసుకున్నాను.

మీరు కవిత్వం కూడా రాస్తున్నారు కదా? కథ, కవితలలో ఏది రాయడాన్నిఎక్కువగా ఇష్టపడతారు?

ప్రతీ కథలో కాస్త కవిత్వం ఉంటుంది. అలాగే ప్రతి కవితలో ఎంతో కొంత కథ ఉంటుంది. ఏది రాసినా మనం అనుకున్నది అనుకున్నట్టు రాయడం ముఖ్యం. ఈసౌకర్యం కథలో కాస్త ఎక్కువగా ఉంటుందంతే. కవిత్వం రాయడంకన్నా ఎక్కువగా చదూతాను. బీ.వీ.వీ ప్రసాద్, శ్రీకాంత్.కే, ఎమ్మెస్ నాయుడు, సిధ్దార్థ, పులిపాటి గురుస్వామి గార్ల కవిత్వం ఇష్టం.

సమాజం దృష్టిలో అసభ్యం అయిన పదాలు కొన్ని మీ కథల్లో కనిపిస్తాయి. వాటిని వాడకుండా కథలు రాయలేమా?

అసభ్యం అని వేటిని మీరు అంటున్నారో నాకు తెలీదు. కొన్ని సమూహాల్లో అసభ్యమైనవిగా ఎంచబడే పదాలు మరికొన్ని సమూహాల్లో అతిమామూలుగా వాడబడ్తుంటాయ్. కథని బట్టి మనం రాసే భాష మారుతుంది. మారాలి.

చౌరస్తా, జిందగీ, వెడ్డింగ్ ఇన్విటేషన్, కీ.మో… లాంటి హార్డ్ హిట్టింగ్ అనుభవాలకు నిజాయితీగా కథారూపం ఇచ్చే ప్రయత్నం చేసాను. మీరన్నట్టు కొన్ని పదాలు వాడకపోయినా వొచ్చే నష్టం ఏం లేదు. బీ.పీ ఎక్కువున్న వారిని భోజనంలో ఉప్పు ఎక్కువ లేకుండా తినమంటారు. అలానే అందరూ తినలేరు కదా.

ఓ కథలో “పైసా ఆదాయం లేని పని సాహిత్య సేవ”అన్నారు. కథలోభాగంగానేనా, లేక వ్యక్తిగతంగా అదే ఉద్దేశమా? ఎందుకలా అనిపించింది?!

అది కథలో భాగంగానే, అండ్ వ్యక్తిగతంగా కూడా. దురదృష్టవశాత్తూ ఇప్పటిస మాజంలో సంపాదన మన జ్ఞానానికి విలోమానుపాతంలో ఉంది. కారణాలెన్నో…!

సాహిత్యం మైండ్ మేకప్ ని మార్చేస్తుంది. ఒకరకమైన సూడో రియాలిటీలో బతికిస్తుంది. అది తెలిసేలోపు చాలామంది జీవితాలు కొండెక్కిపోతాయ్. సాహిత్యం ఎప్పటికీ కడుపు నిండినవారి కళే. అన్నం పెట్టదుకానీ ఆకల్నిమరిపిస్తుంది

మీకు నచ్చిన కథలు, రచయితలూ…?

మెహెర్, పూడూరి రాజిరెడ్డి గార్లు ఏం రాసినా ఇష్టంగా చదూకుంటాను. సొదుం జయరాం గారి కథలూ, నండూరి పార్ధసారథి గారి వ్యంగ్యాత్మక హాస్య రచనలన్నీఇష్టమే. నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం. ఎక్కువసార్లు చదివిన రచన కన్యాశుల్కం.

మీ‌ కథల్లో జీవితాన్ని చూసే తీరు భిన్నంగా వుంటుంది. లోతైన పరిశీలన కనిపిస్తుంది. ముప్పయ్యేళ్లకే ఎక్కడిదా అనుభవం?!

గదిలో కూర్చుని వెయ్యి పుస్తకాలు చదివేకంటే సమాజపు వివిధ పొరల్లో ప్రవేశించగలిగితే మనకు తెలీని ఎన్నో జీవితాలు అవగతమౌతాయ్. సృజనకారులకు – ముఖ్యంగా కథకులకు – భిన్న దృక్పథాలకు సంబంధించిన ఫస్ట్ హ్యాండ్ ఎక్స్ పీరియన్స్ చాలా ముఖ్యం. నా ఆరు సంవత్సరాల మెడికల్ కాలేజ్ జీవితం నాకలాంటి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఓ రకంగా నేను అదృష్టవంతుణ్ణి.

మీతో పాటు రాస్తున్న కొత్తతరం రచయితల కథలు చదువుతున్నారా? అవి ఎలా వుంటున్నాయి?

అల్లం వంశీ, కొట్టం రామక్రిష్ణారెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి, అరిపిరాల సత్యప్రసాద్, అపర్న తోట, చైతన్య పింగళి గార్ల కథలు చదివాను. చాలా నేర్చుకున్నా కూడా.

మాండలికం గురించి కూడా మాట్లాడాలి. మీరు రాసే భాష, మాండలికం మీకోగుర్తింపు నిచ్చింది. అదే సమయంలో కొందరు మీరు రాసే భాష మీద అభ్యంతరాలువ్యక్తం చేశారు. మీ కథలు మాండలికంలో రాయకుండా సాధారణంగా రాసి వుంటేఎక్కువ గుర్తింపు వచ్చి వుండేదేమో?

కథగా రాయాలనుకున్న అనుభవం ఒక భాషని ఎంచుకుంటుంది. ఆ భాష దొరికేవరకు ఏమీ రాయను. చౌరస్తా, జిందగీ లాంటి కథలు తెలంగాణ మాండలికంలోనే రాయతగ్గవి. వాటికి రూట్స్ మా ఊరి జీవితాల్లో ఉన్నాయ్. గుర్తింపు కోసం వాటిని కృతకంగా మార్చలేను. మరొకటి ఏంటంటే, నేను మాట్లాడని పదాలు నాకథల్లో దాదాపుగా రాయను. (ఈ సమాధానాల్లో వాడిన చాలా పదాలు రోజువారీ జీవితంలో నేను ఎప్పుడూ మాట్లాడి ఉండను)

సమాజంలో జరిగే రకరకాల ఘటనలకు కవిగా, రచయితగా మీరెలా స్పందిస్తుంటారు?

ఏ స్పందన ఐనా మన అప్పటి మానసిక పరిపక్వతా, ఉద్వేగ స్థాయిల్ని బట్టి ఉంటుంది. కాలంతో పాటు మారుతుంటుంది కూడా. నిర్భయ ఘటన నన్ను బాధించింది. ఆ మానభంగం చేసినవాళ్ళందర్నీ చంపేస్తే బాగుండన్నంత కసి పెరిగింది. అంతంత చదూకున్న లాయర్లు కూడా ఆ రేపిస్టుల్నివెనకేసుకు రావడాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? రోహిత్ ఆత్మహత్య నన్నుకదిలించింది. అంత ఆలోచనాశక్తి ఉండీ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ మీద కాస్త కోపంకూడా కలిగింది. కానీ, ఒక యువ మేధావి మరణాన్ని ఒక దళిత విద్యార్థి మరణంగా మార్చడానికి రాజకీయ పార్టీలూ నాయకులూ చేసిన కృషిని చూసాక, మనం ఎప్పటికీ ఏమీ చేయలేం అనే నిరాశాపూరిత ఆవేదన కలిగింది. విచిత్రం ఏమంటే అన్నింటా మేధావి వర్గం రెండుగా చీలిపోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవ్వరికీ తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో వైపు ఉండాల్సొస్తే నేను తటస్థంగా ఉండడానికే ఇష్టపడ్తాను. ఇది పలాయనవాదం అనుకున్నాపర్లా. నాకు తెలిసీ ఇది కేవలం నా అజ్ఞానం. ఎప్పటికప్పుడు స్పందించడమొక్కటే రచయితగా ఉనికి నిలుపుకోవడం ఐతే, ఇప్పటి సమాజంలో అలా ఉండగలిగే లక్జరీ కొందరికే ఉంది.

మీ నేపథ్యం?

మా ఊరు మెదక్ జిల్లాలోని గజ్వెల్. మా నాన్న జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్. నేను పదో తరగతిదాకా మా నాన్న పని చేసిన బళ్ళోనే చదూకున్నాను. ఇంటర్కి హైద్రాబాద్ రావడం, అక్కడే ఉస్మానియాలో మెడిసిన్ చదవడమూ జరిగింది. ఇప్పుడు ప్రాక్టిస్ చేస్తున్నాను.

కవి, రచయితకు సామాజిక బాధ్యత ఉంటుందా? మీరు ఒప్పుకుంటారా?

సామాజిక బాధ్యతకంటే వ్యక్తిగత బాధ్యత ముఖ్యం. అందరూ ఎవరి పరిధుల్లో వారు బాధ్యతగా ఉంటే సమాజం ఆటోమేటిగ్గా బాగుపడుతుంది. కానీ “ఆధునికత పెంచిన అవసరాలు కలిగించిన స్వార్థం” మనకా అవకాశాన్ని ఇవ్వట్లేదు. మనందరికీతెలుసు, మనమూ ఎన్నో లెవెల్స్ లో కరప్ట్ అయ్యామని. కానీ, దాని గురించి పశ్చాత్తాపపడే సమయం కూడా ఈ బిజీ జీవితంలో లేదు.


“మెల్లగా
నల్లనిమబ్బులు వెంట్రుకలు రాలుస్తాయి
చీకట్లకి తోడుగా నురగలమంచు పైకప్పుని కప్పేసి
చిమ్నీలోని ఆఖరివెలుగును కమ్మేస్తుంది…” ఇలా మీ కవితల్లో ఒక ప్రత్యేకమైన, విభిన్నమైన ఇమేజరీ కనిపిస్తుంది. ఈ విద్య మీకు ఎలా అబ్బింది?

ఏ కవి ఐనా (రచయిత ఐనా) తను ఊహించిన దృశ్యాన్ని శబ్దాల్లోకి తర్జుమా చేసే ప్రక్రియలో, అప్పుడప్పుడూ అప్రమేయంగా ఆ అన్వయం కుదుర్తుంది. ఈ విభిన్నత ఆయా సమయాల్లోని కవి చైతన్యస్థాయిని బట్టి మారుతుంది. దీనికి కొంతవరకూ నాకున్న పరిమిత ప్రపంచ సాహిత్యావగాహన సాయపడి ఉండవచ్చు. మిగతాదంతా న్యూరాన్ల నడుమ దూకే డోపామైన్, సెరటోనిన్ల ఆటే!


తెలుగు కవిత్వంలో మనకు విరివిగా కనిపించే పదాలు (పువ్వులు, పక్షులు, ఆకాశం, సముద్రం,…) మీ కవిత్వంలో కనపడవు. ఈ పదాలను కావాలనే అవాయిడ్ చేస్తారా లేక ఇంకేదైనా ప్రత్యేకమైన కారణముందా?

నేను సముద్రాన్ని ఇరవై ఆరో యేట చూసాను. మనుషుల చీకటి ముఖాలు, ఏడొ తరగతిలోనే చూసాను. మనం వేటికైతే దగ్గరగా ఉంటున్నామో వాటినే మనం రెసిప్రొకేట్ చేయగలుగుతాం. మన సామాజిక ఆర్థిక కుటుంబ పరిస్థితులే మన రాతల్ని, మాటల్నీ నిర్దేశించేది.


మీ రచనల మీద కాశీభట్ల ప్రభావం ఉన్నట్టు కనిపిస్తుంది. కాశీభట్లతో మీకున్న పరిచయం గురించి మాతో పంచుకోగలరా?

నేను చదివిన తొలి నవల “అంపశయ్య”. అదీ 17 ఏళ్ళప్పుడు. మెడిసిన్లో జాయినయిన కొత్తలో అఫ్జల్ గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో నాకు తగిలిన వాళ్ళు… మో, గోపీచంద్ , కాశీభట్ల, చండీదాస్, స్మైల్. వీళ్ళందరి ప్రభావం నాపై ఉం(డే)ది. కాశీభట్లతో చిన్నపాటి పరిచయం ఉంది, కేవలం ఆయన్ని కలవడానికే కొన్ని సాహిత్య సభలకు వెళ్ళాను అప్పట్లో.


కొత్తగా ఏం రాస్తున్నారు? ఏం రాయాలనుకుంటున్నారు?

రాయడం కన్నా, రాయకుండా ఉండడంలోని సుఖం తెలిసొచ్చాకా ఓ కథ రాస్తున్నాను… ” స్లట్ స్టోరీ”… ఇప్పటికింతే…

**** (*) ****

వంశీ రచనలు కొన్ని:

1. కినిగే పత్రిక

2. వాకిలి పత్రిక

3. సారంగా పత్రిక