కవిత్వం

విలుప్తం

నవంబర్ 2017

రెప్పలగోడలను తొలుచుకొని
ఎవరో లోపలకు వొచ్చినపుడు తడి వెలుతురు వొకింతైనా లేని
గది కన్నులకు చెవులు లేవు

అది వొట్టి మూగది

నలు చదరాల నిటారు ముంగాళ్ళపై
కూర్చున్నది కూర్చున్నట్టుగానే
కుళ్ళిన జంతు కళేబరంలా
అది ఎప్పుడో చచ్చిపోయింది

అటూ ఇటూ చాచుకొని
విచ్చుకున్న నాళికా సముదాయపు గహనాంతరాల మూలల్లో
జుమ్మురుమని నురగలుకక్కే చీకటి జిగట

వెలుతురు తీగలను మీటి
మిణుగురు రెక్కలను విదిల్చే
జీవులు ఇక్కడ అంతరించి పోయాయి

ఇప్పటికిది
అలికిడులకు మెలకువలు వొదిలి
వొంటికి కాసిన్ని ఇటుకలూ, సున్నమూ గీసుకొని
కుట్టుకొన్న సంస్పందనారహిత్య ఛద్మద్వారం