కవిత్వం

కలత నిద్దుర

డిసెంబర్ 2017

నిదురలో
దేహపు ఆత్మ
ఎవరెవరో వొస్తూ పోతూ

దూరపు బాటసారిలా నల్లమచ్చల కుక్కొకటి
ఆగిఆగి పరకాయించి
వొగిరిస్తూ
నాలుకనుండీ ధారగా చొంగ
వొళ్ళంతా రసికారే పుళ్ళు

చిన్నపుడు
ముళ్ళగోరింట కోస్తూ
గుచ్చుకున్న అమ్మ వేలు నెత్తురుపువ్వయిందట

“ఈ రోజుకు మందులు వేసుకోలేను నాయ్నా-”
నిస్సహాయత దీనపడి ముడుతలుపడి

ఏదో దారి
చెమ్మవాసన
రాతిరి మసకనీడల మాటున
ఎవరో నీపై పెనుగులాట

ఎంతకూ తెగని నడక
ఊపిరి తూలిపోయి
ఒళ్ళంతా జలదరించే పొడల చీకటి
తడబడిన పాదం కింద
మెత్తగ జారే రక్తపింజర