కవిత్వం

చిలీ కవి ‘నికనర్ పారా’ రెండు కవితలు

ఫిబ్రవరి 2018

1. పరీక్ష

వ్యతిరిక్త కవి అనగానేమి?

శవపేటికలూ, అస్థి కలశాలూ అమ్ముకునే వ్యాపారా?
దేనిపైనా నమ్మకంలేని మతబోధకుడా?
తనపై తాను అనుమానపడే సైన్యాధికారా?
జరామరణాలను కూడా తమాషాగా భావించి చరించే నిత్య సంచారియా?
దేనిపైనా నమ్మికలేని వక్తనా?
అగాధపు అంచున నర్తించే నర్తకియా?
ప్రతీ ఒక్కరినీ ప్రేమించే స్వీయ ప్రేమికుడా?
సదా విషాదగ్రస్తుడై ఉండే హాస్యగాడా?
కుర్చీలో కూచొని జోగుతున్న కవిగారా?
ఆధునిక రసవాదా? పడకకుర్చీ విప్లవకారుడా? పెటీ బూర్జువానా?
కుహనుడా? దేవుడా? అమాయకుడా? చిలీ, సాంటియాగో నుండీ వచ్చిన రైతుకూలీనా?

పైవాటిలో సరైన సమాధానం కింద గీత గీయండి.

వ్యతిరిక్త కవిత్వమనగానేమి?

టీకప్పులో తుఫానా?
కొండరాయి చుట్టూ కప్పిఉంచిన మంచు వస్త్రమా?
ఫాదర్ సాల్వటేరియా నమ్ముతున్నట్టుగా
నదురుగా మనిషి మలాన్ని సర్ది ఉంచిన ఒక పళ్ళెరమా?
అబద్దమెన్నడూ ఆడని దర్పణమా?
రచయితల సంఘం ముఖం మీద చెంపదెబ్బా?
(దేవుడు వారి ఆత్మను కాపాడుగాక)
యువకవులకు హెచ్చరికా?
జెట్ వేగంతో కదిలే శవపేటికనా?
అపకేంద్ర కక్షలోని శవపేటికనా?
కిరోసిన్ మీద నడిచే శవపేటికనా?
పీనుగల్లేని దహన వాటికా?

సరైన సమాధానం పక్కన ఇంటూ గుర్తు ఉంచండి

***

2. చివరి గుటక

ఇష్టం ఉన్నాలేకపోయినా
ఎంచుకునేందుకు మనకు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి
నిన్న, ఈ రోజు, రేపు

అవి నిజానికి మూడు కూడా కావు-

తాత్వికులు చెప్పినట్టుగా
నిన్న, నిన్నగా మారిపోయింది
అది ఇక మన ఙ్ఞాపకానికి చెందిపోయింది
తెంచి వేసిన గులాబీ నుంచీ రేకులనిక తిరిగి పొందలేము

ఆడాల్సిన ఆకులు ఇక రెండే-
ఇపుడు, రేపు

నిజానికవి రెండు కూడా కావు

అందరికీ తెలిసిన మాదిరే
గతానికి దాపవుతున్నందున
పీల్చి వేసిన యవ్వనంలాగా
ఇపుడు, ఇక ఉండబోదు

చివరాఖరకు
మనకిక మిగిలింది రేపొక్కటే

ఇంకా రాని రేపు కోసం నా గ్లాసుని పైకెత్తుతున్నాను

వాడుకోవడానికి అదొక్కటే మనకిక మిగిలుంది