కవిత్వం

కొన్ని రోజుల తర్వాత

05-జూలై-2013

ఉద్వేగ రహిత మృత్యు సమానమైన కొన్ని రోజుల తర్వాత
తిరిగి లేచిన అతనిని

గడ్డ కట్టుక పోయిన రోజుల గురించి
రోజుల లోతులలో ఇరుక్కపోయిన శిలాజ సదృశ సందర్భాల గురించి
సందర్భాలలో మిణుక్కున మెరిసే
ఉద్వేగ సంబంధిత సజీవ సంస్పందనల గురించి వాళ్ళు తరచి తరచి అడిగారు

ప్రతీ ప్రశ్నకూ అతను మౌనాన్ని సమాధానంగా చెబుతూ
తనలో తను:

కొన్ని రోజులను మనము నిజంగానే మరణంలా, ఆభరణంలా ధరించాలి
రణగొణ ధ్వనుల జీవితం నుండి, మందమెక్కిన వ్యక్తులు, వ్యక్తీకరణలనుండి
దూరంగా ఉండాలి

సర్వమూ పరిత్యజించిన బైరాగిలా సంచరిస్తూ అన్నింటిలోనూ ఉంటూ
దేనిలోనూ లేకుండా చివరకు కవిత్వం నుండి
నిన్ను కవీ అని పేరు పెట్టి పిలిచే వాళ్ళ నుండి కూడా దూరంగా, బహు జాగ్రత్తగా ఉండాలి

కనీసం కొన్ని రోజుల దూరం

నీ నుండి నీవు అలా ఎడంగా నడుచుకుంటూ నీ చుట్టూ పేరుకున్న దానిని
ఒక్కొక్కటిగా చెడిపేసుకుంటూ
నిజంగానే మరణాన్ని, మరణంలాంటి స్తబ్దతనీ, నిశ్చల గంభీరతనూ
చేయి చాచిన కొలదీ విచ్చుకునే మాంత్రిక శూన్యతనూ నీవు నిలువెల్లా తలదాల్చకపోతే

నీకు నీవు లభ్యం కావు
నీ అక్షరాలలో పెళుసులు బారి మసి కమ్మిన శైథిల్యత
జీవితం జీవితమూ కాక మరణం మరణమూ కాక గొంతుకకడ్డం పడిన పెను ఆర్తనాదం

వూరకనే అలా ఉండడమెలానో నేర్చుకొనేందుకు
కొన్ని రోజులను మనం మరణానికి
మరణ సదృశ్యమైన నిశ్శబ్ధానికీ అంకితమివ్వాలి