సమీక్ష

మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

జనవరి 2013

పత్రనేత్రాల పరిశీలనతో ప్రపంచపు
నలుదిశలూ పరికిస్తూ మెదిలినా
నాకో గమనింపు ఉంది
వేళ్ళెప్పుడు నేలలోనే ఉండాలని” (2)

“మట్టివేళ్ళు” పేరు వినగానే మొదట స్పురించే వాక్యాలివి. “మట్టివేళ్ళు” కవి కట్టాశ్రీనివాస్ మొదటి కవితా సంకలనం.మట్టిపరిమళాన్ని గుండెల్లో నింపుకొని,గమనింపునెప్పుడూ మర్చిపోకుండా,పచ్చని చెట్టుగా ఎదుగుతూ వచ్చిన  కవి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.కాంతిని ఆవహించుకోగల శక్తితోపాటే చలించడం అతని సహజ స్వభావం.అయితే వ్యక్తిగా ఎంత పారదర్శకంగా చలిస్తాడో,కవిగాను అంతే పారదర్శకంగా చలిస్తాడతడు.

జీవితంలో నిత్యం తారసపడే సందర్భాలే కట్టా శ్రీనివాస్‌కి కవిత్వ వస్తువులు.తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.అర్ధంలేని abstractని ఉపయోగించడు.కొన్నిసార్లు మనసు,కొన్నిసార్లు స్నేహం,చాలసార్లు మానవత్వం అతని కవితల్లో ప్రదర్శింపబడతాయ్. అందరికి అనుభవంలో ఉండే జీవనస్పృహనే అందమైన పదాల్లో కవిత్వీకరిస్తాడు కట్టా శ్రీనివాస్.తన 67 కవితల సంకలనంలో చాలా విషయాల్నే స్పృశించినా,వాటి కేంద్రం మాత్రం అన్నిట్లో సమాంతరంగా పరావర్తనమైన మనిషితనం. ఆ ఒక్కటి వ్యక్తిగాను,కవిగాను అతడెప్పుడు మరిచిపోకపోవడం అభినందనీయం.

జీవితంలో తను చూసిన అన్ని పార్శ్వాల్ని నిశితంగా అక్షరాల్లో కూర్చే ప్రయత్నంచేస్తాడు శ్రీనివాస్.ఋతువులు తప్పిపోయాయ్ కాంక్రీట్ అరణ్యంలో(29)- అంటూ ప్రకృతిని,ఇప్పుడైతే పోరాటాన్ని వదిలేసి కూలబడిన నిస్సత్తువ ఏడుపు(65)- అంటూ బాల్యాన్ని,ఒంటరి గూట్లో నల్లగువ్వ పొదుగుతున్నట్లుగా మనసులోతుల్లో విషాదం పొదువుకుంటుంది(56) అంటూ వైరాగ్యాన్ని,మానవీయ వీధుల్లో మృగయా వినోదినై(60) అంటూ మనుషుల్ని తన మృదువైన పదాల్లో తేలిగ్గా చెప్పేస్తాడు.”ఛా..బిస్కెట్లబ్బాయి”,”రేవుకొచ్చిన జీవితాలు” అతని సమాజస్పృహకి దర్పణాలు.సున్నితమైన భావాల్తో తను చేసే ప్రయత్నాలకి ప్రతీ పాఠకుడికీ ముచ్చటేస్తుంది.

నెమ్మదిగా పాదంపై ముద్దిచ్చి
త్వరగా వెనక్కి తిరుగుతాను.
నీళ్ళస్పర్శ ఆమెని
నిద్రలేపకుండా..( 18)”

పలకరింపులు లేకపోతేనే
పరిచయాలు ఆగిపోవు.
జ్ఞాపకాలు లేకపోతేనే అవి ముగింపుకొస్తాయ్ (12)”

మనసుగురించి అతడురాసే వాక్యాలుకూడా ప్రతీ మదిని స్పర్శించకుండా ఉండలేవు. “సై కూత-పై మాట” నాకు బాగా నచ్చిన కవిత. ఒకానొక స్థితిలో మనసులో ఊపిరిపోసుకునే ఆశావహ,నిరాశవహ ధోరణుల్ని సరళాల పరుషాల సహాయంతో చక్కగా వ్యక్తపరిచే కవిత. కవి మనస్తత్వమేంటో తెలియజెప్పే కవిత.

ప్రతీదానికి ఓ పరిమితి ఉంటుందని తెలిసినప్పుడు
అపరిమితమైన శూన్యం
దుఃఖంలా విస్తరిస్తున్నట్లనిపిస్తుందెందుకో“(41)
పల్లవిలేనిచరణాలు,చరణాల్లేని దేహం“(38)
ఇల్ లాంటి వాక్యాల్లో మనసు గురించి అతని వ్యక్తీకరణ ఆనందింపజేస్తుంది.

మీరైన సెప్పండి“, “ఒక ఫిరమోన్ కన్నీటి నవ్వు” కవితల్లో objectiveని subjectiveగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆకట్టుకున్నే శబ్ధసౌందర్యాన్ని, వస్తువుయొక్క ఆత్మని ఏకకాలంలో ప్రదర్శిస్తాడు కట్టా. అయితే ఇలాంటి నిర్మాణాల్లో పరిమితులని సృష్టించుకోవడం మాత్రం మర్చిపోలేదు. అనుకోని దుఃఖంతో తప్ప అలవాటుగా ఈ బాహ్య స్వగతశైలిని ఉపయోగించలేదు.

కవిత్వంగురించి అతనికున్న అభిప్రాయాన్ని, కవిగా పిలుచుకోబడే అతని ధైర్యాన్ని, వేదనని కూడా నిస్సంకోచంగానే ప్రతిపాదించుకుంటాడు కట్టా. తీరని హృదయవేదనని కాలంపై దూదిపింజలా ఎగరేసింది కవిత్వపు కాయితం-(49) అంటూ narrative styleలో సాగిన “అంచులదాక”, కవిత్వపు కాగితమే జీవితమని వర్ణించే “చీకటిచెరలో” కవితలు దీన్ని ఋజువుచేస్తాయి. ‘‘హత్య’’, ‘‘అమ్మా..ఎంతపనిచేసావ్’’ లాంటివాటిలో పూర్తి వ్యతిరేఖశైలిలో కవితని నిర్మించే తీరు ఆకట్టుకుంటుంది.

పుస్తకంలో అక్కడక్కడ కొన్నిసార్లు ప్రపంచసత్యాలు నిశ్శబ్ధంగా కవితల్లోకి చొచ్చుకొస్తాయ్.

రక్తం పరవళ్ళు తొక్కుతుంటే ఆలోచన మందగిస్తుంది“( 55 )
గడియారలన్నీ పారేసినంతనే కాలం ఆగదు
చలనం అనేదే లేనిరోజున అది సాంతం చచ్చిపోతుంది “(12)
ప్రయత్నాన్ని మాన్పించే ఆలోచన కంటే,అమాయకత్వమే మేలేమో“(57)

ముందుమాటలో అఫ్సర్ అన్నట్టు ప్రతీవ్యక్తి జీవితంలో ఏదో ఒకసారి అనుభూతి చెందే విషయాల్ని చాలా plainగా పదాల్లోకి తెస్తాడు కట్టా.
నెగటివ్ వాయిస్” లాంటి కవితల్లో అందరి గొంతుని తనలో వినిపించడం మనం గమనించవచ్చు.


(కట్టా శ్రీనివాస్)

ఇకపోతే- తర్కశాస్త్ర పరిచయంవల్లనో,గట్టిగా శబ్దించే పదాలమీద ఇష్టంవల్లనో తెలీదుగాని,అరుదుగానే అయినా అక్కడక్కడా ఒకటో రెండో సంస్కృత పదాలు దొర్లడం, తక్కువ నిడివితో ఉన్న కొన్ని కవితల్లో తగినంత సాంద్రత లేకపోవడం కట్టాపై నాకున్న కంప్లైంట్స్.. అతని కవిత్వంలో శైలి,శిల్పాల గురించి ఎవరితోనైనా పోల్చి వ్యాఖ్యానించడానికి సరిపడా సాహిత్యానుభవం నాకు లేదు.కానీ ఆలోచన్నో,ఆస్వాదన్నో ఏదో ఒకదాన్నైనా తృప్తిచెందించే విషయ సమాహారమే అవసరమైన సాహిత్యమనుకునే నాకు, అతని ప్రయత్నం చూసి సంతోషమనిపించింది. అతని స్పందించే హృదయాన్ని మెచ్చుకోవాలనిపించింది.

 

మనుషులం దీవులమంటు,మనల్ని మనమే ఆవిష్కరించుకోవాలంటు మొదలైన సంకలనం మనం చెయ్యాల్సింది పనే పనే పనే అనే ముగుస్తుంది. ముగింపులేని ఆలోచనను మన ముందుంచిపోతుంది. సరళమైన వచనాన్ని ప్రేమించే పాఠకుల్లో సంతోషాలను పూయిస్తుంది. సెలవు!