కరచాలనం

నన్ను మళ్ళీ నాతో కలిపింది కవిత్వమే!

జనవరి 2013

చిన్నప్పటి నుండి నాకు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ రోజుల్లో మా ఊళ్ళో పుస్తకాలు అంత సుళువుగా దొరికేవి కావు. ఊళ్లోకి ఓ పుస్తకం వచ్చిందంటే ఆ పుస్తకం మీద ఎంతో మంది కళ్ళు ఉండేవి. ఆ పుస్తకం ఎలాంటిదైనా, ఎవ్వరిదైనా పర్వాలేదు బతిమాలి అడిగి తెచ్చుకుని చదివే వరకు మనసంతా దానిమీదే వుండేది. నవల, వీక్లీ, న్యూస్ పేపర్ లేదా ఎంత పెద్ద సంస్కృత గ్రంధం అయినా సరే, చదివి తీరాల్సిందే. ఆఖరికి కొట్టువాడు మిరపకాయ బజ్జీలకు కట్టిచ్చే చిన్న పేపర్ ముక్కను కూడా చదవకుండా వదలకపోయేది. మా బాపుకు పుస్తకాలంటే మహా ఇష్టం. బాపు ప్రోత్సాహం వల్లనే మాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగింది.

నేను ఏడవ తరగతి లో ఉన్నప్పుడు వానమామలై వరదాచార్యులు గారు ఓ రోజు మా స్కూల్ కు వచ్చి తెలుగు అక్షరమాలలో అక్షరాల క్రమం గురిచి చెప్పారు. ‘అ’ నుంచి ‘హ’ వరకు ప్రతీ అక్షరం గురించి ఆ అక్షరాల వెనకున్న కథ గురించి చిన్న పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పారు. ఒక్కో అక్షరం పలికేటప్పుడు మన గొంతు ఎలా కంపిస్తుందో, ‘అ’ అనే అక్షరం గొంతు మొదటినుంచి వస్తే, ‘హ’ అక్షరం ఉదరం లోతుల్లోంచి (పై నుంచి కిందకు),  ఇలా ఇంకా ఎన్నో అక్షర మాయలు చెప్పారు. అప్పుడు నాకనిపించింది ఒక్క అక్షరానికే ఇంత కథ వుంటే మరి అక్షరాలు పదాలై, పదాలు పాదాలై పొందికగా అల్లుకుంటే ఇంకెన్ని భావాలు పలుకుతాయోనని . అలాగే ఆయన రాసిన కొన్ని పుస్తకాల గురించి, కూలిపోయే కొమ్మ? (పేరు సరిగ్గా గుర్తు లేదు) వచన కవిత్వం గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆయన మాటలు విన్నాక నాకు సాహిత్యం చదవాలన్న ఆసక్తి పెరిగింది. రాయాలన్న కోరిక మాత్రం ఇంటర్మీడియేట్ లో బాగా ఉండేది. అప్పుడు కొన్ని కవితలు రాసినా అవి డైరీ దాటి బయటకు వెళ్ళలేదు.

పచ్చటి మా ఊరంటే నాకు చాలా ఇష్టం. మా వూరు చుట్టూ గుట్టలే ఉండేవి!( ఇప్పుడు లేవు!)  ఆ కొండల్లోంచి రోజూ పొడిచే పొద్దును ఆశ్చర్యంగా గమనిస్తూ ఏవేవో పోలికలతో పొద్దు పొడుపును పోల్చే వాణ్ని. (*అందుకేనేమో దూప లో పునరుక్తమయ్యే ఎన్నో పొద్దు పొడుపులు మీరు గమనించే ఉంటారు.)  మా ఊరి దొడ్డి బడిలో కొద్దో గొప్పో మంచిగా చదివేది నేనే కాబట్టో లేక మా బాపు గ్రామ పెద్ద కాబట్టో తెలియదు గానీ మా వూళ్ళో నేనంటే అందరికీ ఇష్టమే. అందరూ ఆప్యాయంగా పిలిచేవారు.

కవిత్వానికి ఊరికి ఏదో లంకె వుంటుంది. బొడ్డు తాడు తెంపాక కూడా పిల్లాన్ని అమ్మనీ కలిపుంచే వో అదృశ్య దారం లాగా, ఊరు వదిలాక కూడా ఇంకా ఆ ఊరుతో తెగని బంధం.

2

ఊరు ఊరంతా ఒక్క ఇల్లుగా తిరిగిన నేను ఇప్పుడు ఆ ఊరుకు దూరంగా… ఎక్కడో.

అందరికి లాగే నాగరికత నన్నూ నిర్దాక్షిణ్యంగా వేల మైళ్ళ దూరం విసిరేసింది. విడదీయడం, విసిరేయడం ఈ నాగరికతకు కొత్తేం కాదుగా?!
జ్ఞాపకాలు మోసుకుంటూ కళ్ళెం లేని కాలం బండ్లో ఇలా వెళ్తూనే ఉంటాం. జారిపోయేవాళ్ళు జారిపోతూనే వుంటారు. రాలిపోయేవాళ్ళు రాలిపోతూనే ఉంటారు. మిగిలున్న వాళ్ళు కాసేపు బెంగటిల్లినా ఈ ప్రయాణం మాత్రం ఆగదు. ఆ బెంగటిల్లడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని ఆశ్చర్యంగా గమనిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకెల్తూనే ఉండాలిగా మరి!

అయితే ఈ ప్రయాణంలో నాతో వెంట తెచ్చుకున్న జ్ఞాపకాల సద్దిమూట విప్పుకోడానికి మా స్కూల్ పక్కన ఉన్నట్లాంటి రావి చెట్టు కోసం వెతుకుతున్న నాకు, రెండేళ్ళ క్రితం చిత్రంగా ఈ కవిత్వం తొవ్వ దొరికింది. “నీ వచనం లో కవిత్వం ఉంది, నువ్వు ఇక రాయాలి” అంటూ ఆ తొవ్వ చూపించింది నా అభిమాన కవి అఫ్సర్ గారు.

తోవ్వ మొదలు దొరికింది, తొవ్వలో నడవడానికి కావలసిన స్ఫూర్తిని పేస్ బుక్ కవిమిత్రులు పుష్కలంగానే ఇచ్చారు. కానీ కవిత్వం గురించి నాకు తెలిసిందానికంటే తెలియందే చాలా ఎక్కువ.  అసలు ‘కవిత్వం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న అందరు కవులకు మల్లే నన్నూ ఎప్పుడూ తొలుస్తుంది. అసలు భావాన్ని భాషతో పరిపూర్ణంగా వ్యక్తీకరించగలమా అన్న మీమాంస నాకు ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి, “నువ్వెక్కడున్నా సల్లంగ ఉండు బిడ్డా” అని కంట నీరు పెట్టుకుని సాగనంపిన మా అమ్మా, మావూరు అభిమానాన్ని ఎన్ని కవితలు రాసినా ఎక్ష్ప్రెస్ చెయ్యగలమా? బాధ, దిగులు, సంతోషం ఇలా ప్రతీ అనుభవం లోలోతుల్లోకెళ్ళి వ్యక్తీకరించడం సాధ్యమా? భాషకు భావం ఎప్పుడైనా పూర్తిగా అందుతుందా?! ఏమో?! అందుకే ఒక కవితైనా, ఒక సంకలనమైనా నా దృష్టిలో ఎప్పుడూ అసంపూర్ణమే.

ఇలాంటి డోలాయమాన స్థితి లో 2010 లో పొద్దు లో నేను రాసిన ‘ఎదురు చూపు’ కవితతో మొదలైంది నా సాహితీ యాత్ర. 2012 మే వరకు నేను రాసుకున్న నలభై కవితలను (సగానికి పైగా పత్రికల్లో అచ్చయినవే)  సంచిలో వేసుకుని పుస్తకంగా వేసుకోవాలని అఫ్సర్ గారి ప్రోత్సాహంతో జూన్ లో ఇండియా బయల్దేరాను. అనుకున్నట్టు గానే పుస్తకం అచ్చయ్యింది. నిజం చెప్పాలంటే హైదరాబాద్ కు వెళ్లేముందు వరకు నాకే కవి తోనూ ముఖపరిచయం లేదు. అఫ్సర్ గారిని మొట్టమొదట చూసింది ఇండియా లోనే. నాకిష్టమైన పూడూరి రాజిరెడ్డి గారితో కేఫ్ లో చాయ్ తాగడం ఎప్పటికీ మరవలేను. కే.శ్రీనివాస్ గారి వచనమంటే పడిచచ్చే నాకు కే.శ్రీనివాస్ తో మాట్లాడే అవకాశం రావడం, అలాగే, నర్సింగరావు, ఓల్గా, యాకూబ్, వసంతలక్ష్మి, అక్బర్, కుప్పిలి పద్మ, జగన్నాథ శర్మ, సుమనస్పతి ఇంకా ఎందరో… వీళ్ళందరినీ కలిసి మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. శిఖామణి, సినారె, నగ్నముని ఇలా ఇంకా కొంత మందిని కలవాలన్న గాఢమైన కోరిక మనసులో ఉన్నా సరైన అవకాశం దొరకలేదు. అన్నీటికీ మించి కవిసంగమం మిత్రులను కలవడం వారు నన్నో స్వంత తమ్మునిలా ఆదరించడం ఎప్పటికీ మరవలేని అనుభవం. ఇలా మిత్రుల సహాయంతో వారి సమక్షంలోనే పుస్తక ఆవిష్కరణకూడా అయ్యింది. అందరి ఆశిస్సులూ దొరికాయి, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

(మరచిపోలేని ఇరానీ చాయ్ సమయం)

ఇక దూప గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే,  పేనుకుంటున్న కవిత్వపు దారాన్ని మా వూళ్ళో  అక్కడికక్కడే వదిలేసి వచ్చిన నాకు మళ్ళీ ఆ దారం కొసను పట్టిచ్చింది ఒకరకంగా ఈ దూప. నా బాల్యపు బాలశిక్షలో దాచుకున్న నెమలీక కన్న పిల్ల ఈ దూప. ఈ కవితలకు నేపథ్యం నేను పుట్టి పెరిగిన ఊరు, నేనిప్పుడుంటున్న వలస ఊరు, ఈ రెండింట నలిగిన నా అంతరంగం. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని నేను తెలుసుకున్న కొత్త సత్యాలు, తెలుసుకోడానికి ప్రయత్నించిన మరికొన్ని తాత్విక విషయాలు, వీటన్నీటి కలబోతే దూప.

3

జీవించిన క్షణాన్ని మళ్ళీ వెనక్కెళ్ళి జీవించే అవకాశాన్ని, మరిచిపోలేని మా ఊరును నా ఆలోచనలతో మళ్ళీ కలెదిరిగే అవకాశాన్ని నాకు ఒకరకంగా ఈ కవిత్వమే ఇచ్చింది. నానుంచి ఎప్పుడో విడివడ్డ నన్ను మళ్ళీ నాతో కలిపింది కూడా ఈ కవిత్వమే.  అయితే ఈ ఒక్క సంకలనంతో తీరే దూప కాదీ కవిత్వం అని తొందరలోనే తెలుసుకున్నాను  దూప తర్వాత కూడా కవితలు రాసాను, ఇంకా రాస్తున్నా. అయితే దూప తర్వాత నేను రాసిందానికంటే చదివిందే ఎక్కువ. దాదాపు 100 కు పైగా కవితా సంకలనాలు చదివాను. పేస్ బుక్ లో కొన్ని వందల కవితలు చదివాను. నచ్చినవి కొన్ని నచ్చనివి మరికొన్ని. ఏదైతేనేం వీటితో నేను నేర్చుకున్నది చాలా ఎక్కువే. ఏ విద్య నేర్చుకోవాలన్నా గురువు అవసరం ఎంతైనా వుంటుంది. కవిత్వానికి కూడా ప్రేరణతో పాటు గురువు కూడా అవసరమే. నా విషయానికొస్తే నే చదివిన నాకు నచ్చిన కవులంతా నా గురువులే. ముఖ్యంగా ఆలూరి భైరాగి, చలం, ఇస్మాయిల్, శివారెడ్డి, సినారె, నగ్నముని,  అఫ్సర్, శిఖామణి, ఎన్ గోపి, గౌరీశంకర్, హెచ్చార్కె, యాకూబ్, బివివి ప్రసాద్, , ఇలా ఇంకెందరో.

దూప తర్వాత రాసిన కవితల్లో ఒక షిఫ్ట్ కనిపించిందని చాలా మంది మిత్రులు అన్నారు. ఎక్ష్ప్రెశన్స్ లో పటుత్యం భావంలో సాంద్రత పెరిగిందని, దూపలో గిరి గీసుకున్న వృత్తాన్ని చెరిపేసుకుని బయటకు వచ్చానని, ప్రతీకలు బాగున్నాయని కొంతమంది మిత్రులన్నారు. చాలా సంతోషం.

తూరుపు మీటిన వెలుగుతీగ మీంచి
అందంగా సింగారించుకుని దిగిన
ఓ వేకువ రాగం
గుట్ట చెంపలు నిమిరి
చెట్ల ఆకులు వెలిగించి
మట్టి చెవుల్లో మంత్రమై చిలికి
రికాం లేని గాలి నోట్లో
రోజంతా నానింది.

… దూప తర్వాత రాసిన ‘నీ పేరున వొక నక్షత్రం’ కవిత నుండి (ఇది రాబోయే నా రెండవ సంకలనం పేరు!). దూప తర్వాత రాసిన కొన్ని కవితలు ఇక్కడ చదవొచ్చు: verelly.blogspot.com

4

అవార్డులతో కవిత్వాన్ని ఎప్పుడూ ముడిపెట్టలేం. అయినా అవార్డు రావడం ఎవరికైనా సంతోషమే కదా! దూపకు అవార్డు రావడం కాస్త చిత్రంగానే జరిగింది. ఓ రోజు “గురజాడ లలిత కళావేదిక” అప్పారావు గారు ఫోన్ చేసి “ప్రతీ సంవత్సరం మేమిచ్చే సిపి బ్రౌన్ అవార్డు కోసం పరిశీలించండి అంటూ శ్రీ ధనంజయ గారు మీ దూపను పంపించారు. మీ దూప మా కవిత్వ దూప తీర్చింది  మాకొచ్చిన పుస్తకాల్లో మీ పుస్తకం ఈ అవార్డు కోసం సెలక్ట్ అయ్యింది. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోడానికి రావాలి” అని ఫోన్ చేసి చెప్పారు. ఎప్పుడైనా పత్రికలో అచ్చయిన నా కవిత్వ పాదాలకింద సంతకమై మోకరించి కనిపించే నాపేరు చూసుకుని మురిసి అదే గొప్ప అనుకునే నాకు ఈ అవార్డు ఇంకాస్త ఎక్కువ ఉత్సాహాన్నిచ్చింది.

అయితే, వాకిలిలో ఈ సంత్సరం అవార్డ్ గ్రహీతలందరి అభిప్రాయం ప్రచురించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ‘కరచాలనం’ శీర్షికలో నా గురించి కూడా వేసుకోవడం కొద్దిగా మొహమాటంగా/ఇబ్బందిగా ఉన్నా- శీర్షికను, వాకిలి సాంప్రదాయాన్ని గౌరవించాలన్న ఉద్దేశ్యంతో నే నన్ను ఇలా, మీతో పంచుకుంటూ…