ప్రత్యేకం

వాకిలి పాఠకులకు జయ నామ సంవత్సర శుభాకాంక్షలు …

ఏప్రిల్ 2014

రోజులు గడవటం కాల గమనం కోసమే ఐతే వికసించే ప్రతి ఉదయ కుసుమంలో ఇన్ని కాంతుల పరాగం ఎందుకు? అస్తమయాలన్నీ లెక్క పూర్తిచేసుకుని వెళ్ళిపోయే ముగింపులే ఐతే ప్రతి సంధ్యలో ఇన్ని రంగుల రసహేళితో లోకమంతా రాగరంజితం అవ్వడం ఎందుకు? కదలడమే కాలం స్వభావం ఐతే, నడిచి పోవడమే నిర్ణయమైతే ప్రకృతినిండా ఆకు గలగలల అందెలమోతలు, సుతిమెత్తనై తాకే చిరుగాలుల చీర అంచులు అవసరమే లేదేమో!

బహుశా సృష్టి స్వభావం సౌందర్యమేనేమో. అడుగుతీసి అడుగు వేస్తే ఒలికిపోయే మధుపాత్రలా నిండుగా జీవరసాన్ని నింపుకుని ప్రతిసారీ అంతే ఆనందంతో, అదే అందంతో ఒక్కో కొత్త ఋతువుని ఆవిష్కరిస్తుంది. ఎన్నిసార్లు చవిచూసినా వెగటులేని అవేరుచుల్ని కొసరి వడ్డిస్తూ సరికొత్త జవసత్వాల్ని మనలో నింపుతుంది.

ఎప్పట్లానే మరో వసంతం వచ్చింది. ఆకు రాల్చేసుకున్న కొమ్మలకి అణువణువునా లేత చిగురుల మెరుగులద్దతూ, ముడుచుకుని పడుకున్న మట్టిని ఎండగోళ్లతో గిచ్చి పరాచికమాడుతూ, ఉత్సాహంతో ఒలికిపోతూ, తుళ్ళింతగా తొణికిపోతూ నిండుగా, పండగగా మరో ఉగాది.

కొలనులో అలల్లా తేటగా, కలతలేని కలలా కలకళగా, కవిత్వంలా పచ్చగా ఇదిగో ఉగాది. ఈ పండగకి వాకిలి కవిత్వపు పచ్చతోరణాలతో ఆహ్వానం చెబుతుంది. కవి మిత్రుల సరళమైన కవితలతో, ’నువ్వేమంటావు’ అని పలకరించుకునే కబుర్లతో, గొలుసుకట్లుగా అల్లుకున్న కవిత్వపు మైత్రీ పరిమళల అత్తరు జల్లుతో మరింత ఆనందంగా, సాదరంగా ఈ సంవత్సరాదిని సందడిగా స్వాగతిస్తున్నాం.

జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా వాకిలి పత్రిక నిర్వహించిన కవి సమ్మేళనపు విశేషాలను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సంవత్సరపు వాకిలిలో గొంతులు సవరించుకున్న కవికోకిలల కూజితాల్ని, ఆనందోత్సాహాలతో మోగించిన కవిత్వపు జయభేరిని విందామా!

జయభేరి మొదటి భాగం – కవితలు
జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు
జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?