కవిత్వం

వీడ్కోలు వేళ

జూలై 2014

పళ్ళు టకటక్కట, చచ్చే చ చ చ్చలి.

తలుపు పైన దబదబా ఎవరది?

ఓ! ఆలస్యం అవలేదులే లోపలికి రా. ఇంకాస్త సమయం ఉంది (కొన్ని నిముషాలే. సరిపోతాయిగా?). ఎలానూ ఇక వెళ్తున్నానని కూజాలో నీళ్లన్నీ తాగేశాను, సరిగ్గా నువ్వు తలుపు కొడుతున్నప్పుడే ఆఖరి చుక్క కూడా గొంతులోకి ఒంపుకుని మరీ. నీళ్ళు అవసరమై కాదు, మిగల్చడం ఎందుకని. ఇంతకీ నీకేం దాహంగా లేదుగా (ఉన్నా చెప్పకు, ఊరుకో) అవునవును శిశిరం- ఆకుల ముద్రలన్నీ కాళ్లకి అంటించుకుని అలాగే వచ్చేశావే లోపలికి? ఎన్నిసార్లు చెప్పుంటాను నీకు, ఈ ఇంట్లో అలాటివి కుదరవని. ఇంకా నయం ఉన్నికోటు బయటే తగిలించావు (నీకు చాలా చలి కదా పోనీ తీసుకురానా అంటావే పైగా, నోర్ముయ్యి) నీ పిచ్చి గానీ అటువైపేగా వచ్చావు, సముద్రమేమైనా దుప్పటి కప్పుకుందా! ఉఫ్, ఈ పాటి చలిక్కూడా నువ్వు.

ఆఁ…! అదే పన్లో ఉన్నా ఈమధ్య. విలువైన వస్తువులన్నీ ఎవరెవరికో ఇచ్చేస్తూ. మధ్యాహ్నాలు కాస్త ఆయాసం తగ్గినప్పుడు ఇలా గుమ్మంలో నిల్చుని ఎవరో దారిన పోయే వాళ్లని పిలిచి ఒక్కోటీ అప్పజెబుతూ ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా అల్లిక బొమ్మలు- చిన్నప్పట్నుంచీ అల్లినవి, చాలా ఏళ్ల నుంచీ ఒక ఇల్లు బొమ్మ అల్లుతున్నా అని చెప్పానా, అది మొత్తం అయింది కానీ తలుపులు పెట్టలేదు. ఏం చెయ్యను, వేళ మించిపోతుందని దాన్ని కూడా నిన్ననే ఒక పిల్లాడికి ఇచ్చేశాను. (మరి నువ్వొస్తావని అనుకోలేదుగా)

ఏంటీ, వణికిపోతున్నానా? ఏం కాదులే. అహ వద్దొద్దు, అక్కడే కూర్చో (భుజాల చుట్టూ చేతులేసి దుప్పటి సర్దడమో, పొదువుకుని పట్టుకోడమో చేస్తావ్. ఏమీ అనేవాళ్ళెవరూ లేరు కానీ, తెలుసుగా ఈ ఇంట్లో అలాటివి సరిపడవు.) చెప్పు ఏమివ్వమంటావు వెళ్ళేముందు గుర్తుగా? ఇదిగో, అప్పుడప్పుడూ రాలిన పూరేకలు ఎండబెడుతూ ఉన్నాను. వాటిని కాగితమ్మీద అతికించి నీకో మంచి బొమ్మ గీసిస్తాను. కాస్త సాయం చెయ్యి, (కలిసే చేసుకోవాలి. మొహమాటాలకి ఇది సమయం కాదు).

ఇదిగో- మాటల్లోనే అయిపోయింది దాదాపుగా. (ఇదేం ఆకారం అంటావ్? హృదయమా, కుక్క పిల్లా? హహ్హ). ఆ బయట తగిలించిన కోటు జేబులో పెట్టుకో (ఇక బయల్దేరమనేగా, అర్థం కాదా?). నా సంగతా, ఈ క్షణాల్లో ఎవరైనా ఎంత బావుండొచ్చో అంతా బావున్నాను. నువ్వుండీ చేసేదేముంది. మరీ, నీతో పాటు తీసుకొచ్చిన చెట్టు బెరళ్ళ వగరు వాసనా, సముద్రపు ఉప్పటి గాలీ, ఇంకేమైనా అలాంటివి ఉంటే తీసికెళ్ళు (నే వెళ్ళిపోయాక ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఇవన్నీ ఉంటే బావుండదు.) మంచిది, ఇక తలుపేసుకుంటాను. ఇంకేముంది పని, వెలికిల్లా పడుకుని ఆకశం కనపడని ఇంటి కప్పుకేసి చేతులు చాపి ఆ ప్రయాణ సందర్భాన్ని ఆహ్వానించడమేగా!

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
Painting: జావేద్