సంపాదకీయం

రైటర్స్ డైరీ

అక్టోబర్ 2014

తేదీ: కొన్ని అంకెల మధ్య రెండు గీతలు
సమయం: మొట్టమొదటి జలదరింపు లేదా కుదుపు

చెప్పొచ్చేదేమిటంటే, అదొక ఆహ్లాద సమయం, ఒక పుట్టుకని కాస్త ఆలస్యంగా గుర్తించిన లేక కావాలని కాస్త ఆలస్యంగానే పుట్టిన ఒక సందర్భం. ఎక్కణ్ణుంచో గాలి ఆగకుండా పరిగెడుతూ వచ్చి నా పక్కనే గసపోసుకుంటూ ఆగిపోవడంతో మొదలైన ఒక ఆరంభం. ఒకరోజుని రెండు మందపాటి డొల్లలుగా పగలగొట్టుకుని ఆ వేసవి మధ్యాహ్నం చెట్లకొమ్మల్లో చెంపదెబ్బలుగా ఫెళ్ళుమని మోగిన గుర్తు. “అబ్బా! ఒకటే ఉక్కతీస్తుంది” అన్న చుట్టుపక్కల మాటలన్నీ కలిసి ఒకే ఒక్క వడ్రంగి పిట్ట టకటక చప్పుడుగా ఉక్కపోతలా ఆవహించిన వేళ. అంతే- అదొక ముగింపు, అదొక తెగతెంపులు. అప్పట్నుండీ ఆకారాలన్నీ అమీబాలే, నిర్ధుష్టాలన్నీ అస్పష్టాలే.
-ఇదే కాబోలు మొదలు.

***

రంగులు చాయలుగా చెదిరిపోవడం
———————————
గాఢంగా చిక్కగా అలుముకున్నవన్నీ చెదురుమదురవ్వక తప్పలేదు-నమ్మకాలు, ఆశలు కూడా. అక్షరాలుగా మార్చుకుంటే తప్ప మనుషులు అర్థం కారు. కల్పనకి లొంగని నిర్జీవమైన వాస్తవాల నీడగా ప్రపంచం సాక్షాత్కరించింది. ప్రేమించాల్సిన సందర్భాలన్నీ ప్రశ్నించడంతోనే గడిచిపోయాయి. లోకంలో ప్రతి ఒక్కరిలోనివీ ముక్కలు కొన్ని కలిసి ఒక కొల్లేజ్ గా, అదే “నేను” గా, రంగులొలికిపోయిన నా చిత్రంగా కనపడ్డాను. నన్ను నేనొక సమూహ అస్తిత్వంగా తెలుస్తున్న కొద్దీ బతకడం బహువచనమై, అస్తిత్వం బహుముఖమై నాతో నాకు ఏ నిముషమూ సంధి కుదరదు. లోపలి గొంతులు ఏది దేన్ని నొక్కిపడుతుందో, ఏ అనుభవం ఇంకే ఊహని తొక్కిపెడుతుందో గమనించడంలో- సంతోషమూ, దుఃఖమూ కాని ఒక అలసటలోకి, ఒక అభావంలోకి విశ్రమించడానికి అలవాటు పడతాను.

***

మొగలిపొద నీడ కోసం
———————
ఎటూకాదని తెలిసీ తుప్పల్లో, దుబ్బుల్లో చాలా దూరమొచ్చాక, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతి దొరకదు.
ముళ్లకంప గీసుకుపోయినందుకు కాదు, మచ్చలు మిగిలినందుకు రాయడం తప్పదు.
రాజీ ప్రయత్నాలన్నీ విజయవంతంగా విఫలమయ్యాక,
దుఃఖం ఎలానూ దారిని మెలిపెడుతుంది కాబట్టి, తర్వాతి మలుపు కోసం కాస్త దాహాన్ని దాచుకుంటాను.

పువ్వులో సముద్రాన్ని చూస్తాను గనక,
వేళ్లతో ఇసుకలో తవ్వినప్పుడు నీటి చెలమల్నినిషేధించలేను గనకా,
తీరాన్నొదిలి వెళ్ళిపోయాక మళ్ళీ అంతా మాములే కదా అన్న ఆలోచనని నివారించలేను గనకా..
చెరిగిపోతాయని తెలిసీ కాలక్షేపానికి కొన్ని పేర్లక్కడ రాసి పోతాను.
వేళ మించినప్పుడు మళ్లీ నేనే ఉప్పునీటి అలనై వాటిని చెరిపి పోతాను.

మొగలిపొద నీడకోసం ఇంటికెళ్ళకుండా అక్కడే ఆగిపోయిన పిల్లాడొకడికి- నా డైరీలన్నీ ఇచ్చేస్తాను.

***** *** *****

(వాకిలిలో “రైటర్స్ డైరీ” శీర్షికను మొదలు పెడుతున్న సందర్భంగా..)

 ***** *** *****

 

“రైటర్స్ డైరీ” శీర్షిక కోసం ఎవరైనా రాయొచ్చు.
చలం మ్యూజింగ్స్, కాఫ్కా డైరీస్, సోమర్సెట్ మామ్ A writers note book; అలా ప్రతి కవికి రచయితకీ కథగా, కవితగా మారకుండా చాలా ఆలోచనా స్రవంతి ఉంటుంది. ఒక శిల్పానికి, థీమ్ కీ లొంగదు. కొన్ని సంభాషణలు, కొన్ని ఎన్కౌంటర్స్, కొన్ని సంఘటనలు, గమనింపుల గురించి మనం మనసులో అనుకునేవి.. రఫ్ గా రాసుకుని ఏ ప్రత్యేకమైన వస్తవుకీ పొసగక ఏ కవితలోనూ, కథలోనూ వాడనివి, . అలాటివి ప్రచురించాలని ప్రయత్నం. ప్రయత్నంతో కుట్ర చేసి శైలీ శిల్పమూ అంటగట్టకముందు, ఒక కవి అంతరంగ ప్రవాహం ఎలా ఉంటుంది, చాలా సరళంగా సహజంగా జరిగే విషయాలు కూడా ఒక కవి బుర్రలో ఎలా రికార్డ్ అవుతాయో చూపించాలన్న ప్రయత్నమే ఈ శీర్షిక.