లోపలి మాట

మానస వెతుక్కున్న చిలకల చెట్టు!

15-మార్చి-2013

“లోపలి మాట” కొత్త శీర్షిక ప్రారంభం
కవిత్వం నిరంతర సాధన ఫలం. ప్రతి కవికీ తనదయిన వాక్యసాధన కోసం అహోరాత్రాలు తపించాల్సి వుంటుంది. కేవలం పొగడ్తలే ఈ సాధనలో పనికి రావు. వాక్య రహస్యం చెప్పే విమర్శ కవిని ముందుకు నడిపిస్తుంది. ఇంకా పదునయిన కవిత దిశగా నడిపిస్తుంది. అలాంటి దారిదీపం ఈ ‘లోపలి మాట’ శీర్షిక. ఒక కవిత తీసుకుని అందులోని లోటుపాట్లని వివరించే శీర్షిక. ప్రతి రెండో శుక్రవారం మీ కోసం!


———————————————————————————————————————–

భావుకత్వపు పందిరి కింద ప్రేమ, ప్రకృతి, జ్ఞాపకాలు, వియోగం అనే నాలుగు స్తంభాలాటలో తమ అనుభూతులను కవిత్వంతో దాగుడుమూతలాడించిడం చాలామంది కవుల్లాగే మానసకూ ఇష్టమైన ఆటలా అనిపిస్తుంది. ఈ కవితను ’చిలకలు వాలే చెట్టు’గా పిలుచుకొని పచ్చగా నవ్వుకోవడం లోనే ఆమె కవిత్వపు తాలూకూ ఒక ఆహ్లాదభరితమైన కువకువ మనకు వినిపిస్తుంది.

మొదటి పంక్తుల్లో- జీవిత గమనంతో, కాలపు వేగంతో పాటు అనివార్యంగా పెట్టే పరుగు విసుగెత్తినప్పుడు, ఒక ఆశయమంటూ లేక అలసిపోవడం కోసమే పరుగులు పెట్టిన బాల్యపు గుర్తుల్ని స్మరిస్తూ సముద్రపు అలలమీది నురగలాంటి తేలికపాటి విరామంలోకి జారుకుంటుంది సందర్భం. అక్కడ తీరం గురించిన దిగుల్లేదు. కావల్సిందల్లా మరో ఆలోచన ఒత్తిడి చెయ్యలేనంతగా చుట్టు ముట్టే సంతోషపు సముద్రమే.

ఐతే ఈలోగా సంతసపు సముద్రం కాస్తా కల్లోలపు కడలి అయిపోతుంది. ఆ కల్లోలానికి కారణం “నా స్వార్థ చింతనకు లోబడ్డ  నిర్ణయాలేవో” అని చెప్పుకోవడం లో తరువాతి పంక్తుల్లో ఉధృతమవ్వబోయే ఆత్మనింద గురించిన తీగ దొరికేస్తుంది. “కల్లోల కడలిలో మార్గం తప్పిన సుమనస్సునై, ఆసరా ఇవ్వగల పట్టుకొమ్మకై అన్వేషిస్తూ” కడలిలో మార్గం తప్పినప్పుడు కావల్సింది దారిచూపే చుక్కాని కానీ మునిగిపోకుండా, జారిపడకుండా ఆసరా చేసుకునే పట్టుకొమ్మ కాదుగా అని అనుమానమేస్తుంది. అదీ కాక ’సుమనస్సు’ అనే చెప్పుకోవడం వల్ల కావల్సింది చెడునుంచి మళ్ళింపు మాత్రమే అని కూడా తోస్తుంది. పైగా మొదటి రెండు ఖండికల్లోనే ’మానసాన్ని, సుమనస్సునై’ అని కనపడ్దప్పుడు ఆ పదాల వాడకంలో కాస్త అత్యుత్సాహం గోచరించే ప్రమాదం కూడా ఉంది.

“సరిగ్గా అలాంటప్పుడే గుర్తొస్తుంది -అమ్మ నాటించిన ఆ చిన్న విత్తు” అని తర్వాతి వాక్యాల్లో చెప్పేవరకూ ఇది సముద్రాన్ని ప్రతీకగా తీసుకుని ఆసాంతం సాగబోయే కవిత ఏమోనని అప్పటివరకూ ఉన్న ఒక అంచనాను తల్లకిందులు చేసి ఉన్నట్టుండి బాల్యపు జ్ఞాపకాల చెట్టెక్కి కూచుంటుంది. అప్పటివరకూ ఉన్న సముద్రమూ, జీవన తరంగాలతో  సంబంధమూ, కొనసాగింపూ లేకుండా అసలు ఇక్కడనుంచి మరో కొత్తరకం ప్రారంభం, దాని కొనసాగింపూ జరుగుతాయి. ఆ కొనసాగింపులో బాల్యమూ, స్నేహమూ, యవ్వనమూ వంటి దశలన్నిటిలో ఆ చెట్టు పాత్ర ఉన్న సన్నివేశాలను జాగ్రత్తగా మాలికగా అల్లుతూ ఒక వరసను తీసుకువచ్చారు. ఐతే చిక్కంతా ఆ చెట్టుకి కవి దూరమవ్వడం తో వచ్చింది. అప్పటివరకూ జ్ఞాపకాల దొంతరగా, అనుభూతి ప్రధానంగా, లాలిత్యం నేపథ్యంగా సాగిన ధార ఉన్నట్టుండి స్వగతపు ధోరణిలోకి, ఇందాకనే హెచ్చరించినట్టు తీవ్రమైన ఆత్మనిందలోకీ దిగుతుంది.

 

“తల్లీ తండ్రీ అన్నీ తానై పెంచిన అమ్మను అద్దె కొంపకు పొమ్మంటూ వెళ్ళగొట్టినప్పుడే,” అన్న వాక్యాల దగ్గరే ఈ కవిత ఊహించని మరో దోవలోకి దిగిపోయింది. అప్పటిదాకా చంగనాలు, నిప్పచ్చరాలు అంటూ అనుభూతి ప్రధానంగా సాగిన నడక అక్కడితో మొదలుకొని ఏసీలు, కంప్యూటర్, గేమ్స్, మూడంతస్తుల మేడలు అంటూ చిలకలకీ, చెట్టుకీ, అనుభూతికీ చెందని వాస్తవిక జీవన చిత్రణలోని వస్తు సంచయాన్ని వరసగా హడావిడిగా పేర్చేస్తుంది. ఉన్నట్టుండి సామాజిక పరిణామాల, హరిత విప్లవాల సందేశాల ఊపులో పడిపోయి పాఠకుణ్ణి పట్టించుకోవడం మానేస్తుంది. “వినతిపత్రాన్నెగురవేస్తూ నిష్క్రమిస్తాను. “ అంటూ చివరికి ఉపన్యాస ధోరణిలో ముగుస్తుంది.

ఎంచుకున్న “జామ చెట్టు” అన్న ఒక్క వస్తువుని కేంద్రంగా చేసుకుని బహుముఖాల జివితానుభవాల్ని చూపించే ప్రయత్నం బావున్నప్పటికీ,  వ్యక్తీకరణలో సమన్వయ లోపం వల్ల కాస్త అయోమయానికి గురయిన కవిత ఇది. భాషా పరంగా ఉల్లాసంగా సాగుతూ మధ్యల్లో సతతమూ, ఆలింగనాభిలాషి వంటి పదాలతో అక్కడక్కడా బరువెక్కింది. ఒకచోట “విషాదపు సుళ్ళు తిరుగుతున్నాయి.” అన్న సందర్భంలో స్నేహితులతో వచ్చిన దూరం సమయానుగుణంగా వచ్చిన సహజమైన దూరమే కాబట్టి అది దిగులుగానో, బెంగగానో మారుతుంది తప్ప ’విషాదం’ గా భావించడం అక్కడ ఒదగలేదనిపిస్తుంది. మరోచోట శుద్ధ వ్యావారికంలో సాగుతున్న మాటల మధ్య “అబ్బెసము” వంటి పొసగని ప్రయోగమూ , “ఆకులొచ్చాయనీ, పిందె  కాసిందనీ” వంటి చోట్ల వర్ణన కన్నా వివరణ ఎక్కువై కాస్త సాగతీతగానూ, అసౌకర్యంగానూ అనిపిస్తుంది.

—————————————————
చిలుకలు వాలే చెట్టు

పరుగాపి నిలబడ్డ ప్రతిసారీ
పసితనం పసందైన జ్ఞాపకాలతో
మానసాన్ని పెనవేసుకుపోతుంది
అప్పుడు సంతసపు సంద్రములో
తీరం గురించి తపన లేని వాడిలా,
హాయి కెరటాల తేలిపోతుంటాను.

ఇంకొన్ని సార్లు ఏమీ తోచని ఏకాంతంలో
నా స్వార్థ చింతనకు లోబడ్డ నిర్ణయాలేవో
స్వాంత సరోజాన్ని రేకులుగా విడదీస్తుంటే
కల్లోల కడలిలో మార్గం తప్పిన సుమనస్సునై
ఆసరా ఇవ్వగల పట్టుకొమ్మకై అన్వేషిస్తూ
ఆర్తిగా నిరీక్షిస్తుంటాను.

సరిగ్గా అలాంటప్పుడే గుర్తొస్తుంది -
అమ్మ నాటించిన ఆ చిన్న విత్తు
పెరిగి బాల్యమంతా పరచుకున్న
చిలుకలు వాలే జాంచెట్టు
అది చిన్ననాటి చెదురని స్మృతుల్లో
చంపక వృక్షం చెంగట ఠీవిగా
సతతము పచ్చగా, పదిలంగా
ఆలింగనాభిలాషిగా నిలబడ్డ గుర్తు!

చిట్టి పొట్టి చేతులతో నీళ్ళు పోసి,
మొక్క మొదట్లో మన్ను మార్చి,
ఆకు లొచ్చాయనీ, పిందె కాసిందనీ
మెరుస్తోన్న కళ్ళతో విరుస్తోన్న నవ్వుల్తో
చాటింపేసిన నాటి చెంగనాలు గుర్తొస్తుంటే
గుబులు ఊబిలోకి గుండె పరుగులిడుతుంది.

ధృఢంగా నిలబడ్డ కొమ్మలకు
అట్లతద్ది నాడు ఉయ్యాలలేసి
ఆకాశం వైపుకి ఈడ్చి విసిరేస్తే
పసిపాపల్లే మారిన అమ్మ
కేరింతలు తుళ్ళింతలు
సెలయేరు గలగలల్లో కలగలసిన
అలనాటి మా నవ్వులు
దిగంతాల తేలి వచ్చే దివ్యగానంలా
అప్పుడప్పుడూ తాకిపోతుంటాయి.

నడి వేసవి రోజుల్లో నేస్తాలను వెంటతెచ్చి
వేళ కాని వేళల్లో పంతంగా చెట్టు దులపరించి
పచ్చి జాంపళ్ళ వగరు రుచికి వెరసి
వాటన్నింటినీ వంతులేసుకు విసిరేసి
చెరువులో వలయాలు చూసి
విరగబడి నవ్విన రోజుల తలపోస్తే
ఈ క్షణాన హృదయ తటాకాన
విషాదపు సుళ్ళు తిరుగుతున్నాయి.

పసితనం దొర్లిపోయి యుక్తవయసు
ఉరకలేస్తూ వద్దకొచ్చాక
ఓ నిశ్శబ్దపు శారద రాతిరి
ప్రేయసిని బిడియంగా పిలిచి
అక్కడే, ఆ చెట్టు క్రిందే,
విరబూసిన వెండి వెన్నెల కౌగిట్లోనే
దోరపండు కాకెంగిలి చేసుకుంటూ
ఆ అచ్చరకు మనసిచ్చిన స్మృతులు
తాకీ తాకని తనువుల స్పర్శకి మేం
తడబడి ఒణికిన క్షణాల గుర్తులు
వర్తమానంలోని నిప్పచ్చరాన్ని
నిర్దయగా చూపెడుతున్నాయి..!

కాలం కొలిమిలో కలలూ క్షణాలూ కరిగాయి
నేను పెద్దవాడినవుతూనే పేదవాణ్ణయ్యాను
తల్లీ తండ్రీ అన్నీ తానై పెంచిన అమ్మను
అద్దె కొంపకు పొమ్మంటూ వెళ్ళగొట్టినప్పుడే,
ఇల్లు కూలగొట్టి మేడలు కట్టాలన్న దురాశతో
పొదరింటిని చేజేతులా పోగొట్టుకున్నప్పుడే
నేను నిరుపేదనయ్యాను.

పసితనపు తొలి సంతకాన్నీ
తొలివలపు తీపి గురుతునీ
మళ్ళీ దొరకని అమ్మ ప్రేమనీ,
అమృతాన్విత తరువునీ
అన్నింటినీ కోల్పోయిన
అభాగ్యుడనయ్యాను.

చెరువొడ్డున చల్లగాలికి ఆటలాడిన గతం
ఈ ఎ.సి గాలుల్లోని కృత్రిమత్వానికి
ఉక్కపోతకి గురై ఉక్కిరిబిక్కిరవుతోంది
మలయమారుతం కలలోలా స్పృశిస్తుంటే
మనసంతా స్పష్టాస్పష్ట భావాల హేలతో
సతమతమైపోతోంది.

చెట్లెక్కి పుట్టలెక్కి ఆటలాడి అలసిన బాల్యం
అడుగు మేర కూడా మట్టి లేని ఇంటిలో
కంప్యూటర్ల ముందు కళ్ళద్దాలతో కూర్చుని
తోడక్కర్లేని క్రీడలాడుతున్నమనవళ్ళను చూసి
మాటలు మరచిన మర మనుష్యులను చూసి
బెంగగా నిట్టూరుస్తోంది

వెర్రి ఆటలాడుతూ, యంత్రాలతో పోటీలు పడుతున్న
పసికూనలను చూసిన ప్రతిసారీ బరువెక్కిపోయే గుండె,
చెరువు మీదకి నిండా వంగిన చిట్టచివరి కొమ్మనెక్కి
పళ్ళూ కాయలూ కోయడానికి కావలసిన అబ్బెసమూ
పట్టు తప్పి పడితే,తడిసిన మనసు ఆరదన్న సత్యమూ
తెలియజెప్పాలని తపన పడుతోంది!

కానీ ఎలా..
ఇప్పుడా చెట్టు లేదుగా..
నే కట్టిన మూడంతస్థుల మేడ తప్ప!
ఆ చెరువూ కనరాదిక,
తప్పు కప్పేందుకు మేం పోసిన
మూడు లారీల మట్టి తప్ప!

అందుకే ఈ ఆఖరు మజిలీలో,
నా జీవితపు చివరి రోజుల్లో..
ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుంది
ఎవ్వరైనా, నడవలేని నవ్వలేని
ఈ ముసలివాడికి
తప్పుల తలచి
కన్నీళ్ళ కరిగే
పశ్చాత్తాపానికి
ఒక్క విత్తివ్వండి…

కాంక్రీటు కట్టడాల వికృత లోకపు నడుమన
అణువణువూ యంత్రాలు కుతంత్రాలు నిండిన
నాగరిక ప్రపంచాన ఎక్కడైనా..ఏ మూలైనా..
గుండె ఉన్న మనుష్యులారా…
గుప్పెడు మన్నున్న చోటుంటే కాస్త చూపెట్టండి.

విత్తులు విచ్చుకు విరిసే బృందావనాల నూహిస్తూ..
పూప్రదక్షిణాల అలసే తుంటరి ఎలతేంట్లను తలపోస్తూ..
జగాన పచ్చందనాల సిరులు కురవాలని
ఆపై నేనిక కొమ్మల మసలే చిలుకనవ్వాలని
వినతిపత్రాన్నెగురవేస్తూ నిష్క్రమిస్తాను.

http://www.madhumanasam.in/2012/09/blog-post_9.html

—————————————————-