కవిత్వం

అనుకోకుండా

అక్టోబర్ 2013

చాలా చాలా అనుకుంటాం

దూరంగా ఉండగలమనీ, దూరాన్ని తుంచగలమనీ, ఏదనుకుంటే అది ఎప్పుడైనా చేయగలమనీ…
అన్నీ మాటలే. విరహపు బాధ జీవితమంతా విస్తరించాక-ఏం మాట్లాడాలో అర్ధం కాదు. ఏది చేయాలన్నా మనసురాదు.
గుండెలు పగిలి ఏడ్చేదాకా ఏ ఒక్కరోజూ నిద్రపట్టదు. ఏ ఒక్కరోజూ కలలు తీరవు.
లయించి లయించి ఒరిగేదాకా ఏ ఒక్క క్షణమూ తృప్తినివ్వదు.

వెన్నెలస్నేహితా!
లయతప్పడమొక అదృష్టం. పసిపిల్లలకూ మనకే పట్టే పట్టరాని అదృష్టం.
హృదయం లయతప్పితే పాట స్వరం తప్పుతుంది.అనుభవాల్లాంటి చరణాలన్నీ అప్పటికప్పుడే అంతమైపోతాయ్.
పల్లవించే బతుకురాగం పాడీ పాడీ అలిసిపోయాక- ఊపిరి నిన్నూ నన్నూ నిశ్శబ్ధం చేస్తుంది.

వెన్నెలస్నేహితా!
ఊపిరివృత్తంనుంచి విసిరివేయబడ్డాక ఏ దిక్కూ అగుపించదు.ఏ మనిషీ కనిపించడు.
ఇదిగో,ఈ నల్లని కాంతిరేఖ మనమార్గం. దీనిమీదనే మనం కాలాన్ని దాటుకొని వెల్లగలగాలి.
అదిగో, ఆ రక్తపు చారిక చేరగలిగితే మనమూ, మన ప్రయాణమూ ముగిసినట్టె.

వెన్నెలస్నేహితా!
హృదయం విచ్చుకోవడం అనాది.హృదయం బద్దలవడమే అర్హత. చివరిదారిలోకి చేరాంగనక
ఎలా నడిచినా ఎవరూ చూడరు. ఎంత ప్రేమించినా ఎవరూ అడగరు.ఏ తప్పటడుగూ సరిచేయబడదు.
నక్షత్రరాశి అస్తమించినట్టు- నువ్వూ నేనూ అస్తమించేదాకా రాళ్ళెట్ల వికసించేదీ, పువ్వులెట్లా బద్దలయ్యేదీ రహస్యం.

 

(ఈ కవిత ‘అనుకోకుండా’ సీరీస్ లో 18వది.)