కథ

చిన్నమాట

మార్చి 2015

“క్రిష్ణలో ఎందుకు.. వెన్నెల్లో చేస్తాను.” టక్కుమని చెప్పేసింది.

తనంతే. సూటి మనిషి. ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా చెప్పేస్తుంది సమాధానాలు. ఇంక మళ్ళీ నేను తనని స్నానం చేయమని అడగలేదు. కళ్ళు మూసుకున్నా నేను చూడలేంది, ఆమె దాచగలిగేది ఏదన్నా ఉంటదా అని ఒక ప్రశ్న-
ఆమె కార్ డోర్ని ఒక్కతోపు తోయగానే ప్రశ్న చెదిరిపోయింది. ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఇది వరసగా మూడో రోజు.. మేమిలా రోడ్ల వెంట, ఊర్ల వెంట తిరుగుతూ ఉండటం.

1

ఎలా మొదలైందనుకున్నావు? అబ్బా.. అది చిత్రంలె. మొదటి రోజు మేం కలిసినపుడు రైలుబండొకటి మా ఇద్దరి మధ్యలోంచి వెళ్ళిపోయింది. ఇదిగో- ఇప్పటికీ దాని శబ్దం నాకు గుర్తుస్తోంది.

ఫోన్లో రెండుసార్లు మాట్లాడుకున్నాం. మిగతా అంతా చాటింగే. ఎప్పుడూ ఆమె ఊరుగాని, ఆమె రోజు గడిపే తీరుగాని నేనడిగింది లేదు. ఆమె స్టేషన్లో దిగి మీ వూరొచ్చానని చెప్పేదాక పెళ్ళైందో లేదో కూడా తెలీదు.

నమ్మవు కదూ? కొన్ని జీవితాలంతె.

2

ఎటో దిక్కు తీస్కుపోవాలిగాని, ఆమె ఎందుకొచ్చిందో, కనీసం తిన్నదో లేదో అదన్నా చెప్పదాయె. ఏమడిగినా బదుల్లేదాయె. ఆఖరికి చెయ్యిపట్టుకొని, ఆటోదాక లాక్కెళ్ళి కూర్చోపెడ్తే కదూ ఎవర్నో కలుద్దామనుకుంటోందని తెలిసింది.

3

“ఎక్కడికెళ్ళాలి? ”

అబ్బా! వీడొకడు. వింత చూపుతో. ఎటో దిక్కుకి పోనీయ్మంటే ఎంతగా అపార్ధం చేసుకుంటాడో.

“రూం కి వెళ్దామా?”

ఇంకా నయ్యం. వీడికి తెలుగొచ్చి సచ్చింది కాదు. మహా మాంచి నగరం. ఓ కులీ! ఈ చిన్నచేపలు మాత్రం నాకు తెగ నచ్చుతాయి.

“శంషాబాద్ ఎయిర్పోర్ట్”

వార్నీ! రైలు దిగింది ఫ్లైటెక్కడానికా? సర్లే, మనకి పోయిందేముంది.

4

ఏముందా? హమ్మో హమ్మో! చాలా ఉంది. ఆటోలో అంత దూరమా. ఒసేయ్ పిచ్చిదాన. క్యాబ్లోనో, ఎయిర్పోర్ట్ బస్లోనో పోదాం. ఈ డబ్బుల్తో ఆటో కొనుక్కోవచ్చు. ఊ, నవ్వకూ…

5

ఎవరే వాడు? ఎందుకంత విచిత్రంగా మెట్లు దిగుతున్నాడు? దిగులుగా చూస్తూ వెళ్ళిపోతున్నాడు? పోలీసుల్తో ఆ గొడవేంటి వాడికి? అసలు డబ్బులెందుకిచ్చాడోయ్ నీకు? బై ద వె నువ్వు పెళ్ళికిముందు ప్రేమించింది వీన్నేనా?

ఏంటి? డాలర్స్ మార్చాలా? ఐడి ప్రూఫ్ తెచ్చుకోలేదా? సరే నాదుందిగాని, ఎటు పోదాం ఇప్పుడు?

అరగంటసేపున్నావ్ కళ్ళు కదపకుండా. ఎటిప్పుడు? నిన్నేనోయ్. ఏదన్నా తిందామా? పోనీ కాఫీ…

ఊ..హు.. విసుగ్గానో, చిరాగ్గానో, కోపంగానో, బాధగానో ఏదో ఒకలా ఏదన్నా మాట్లాడ్తే బాగుండు. దేవుడా! ఎగిరే విమానాల్ని చూస్తూ కూర్చుంటే ఎవడర్ధం చేస్కోవాలి దీని భాషని?

ఓయ్… ఫ్లైట్ కొనడానికి ఇవి సరిపోవు.

హమ్మయ్య! నవ్వింది. కాఫీకే కడుపు నిండిపోయి కన్నీళ్ళొచ్చినట్టుంది. యెదవ జీవితం. ఎందుకింత అల్పసంతోషులుగా బతుకుతారో.

అద్సరేగాని పిల్లా…

6

హ్మ్! అర్ధమైంది. నాకైతే తిరువణ్ణామలై బాగా తెల్సు. వేరే స్టేట్. సేఫ్గా ఉండటం సంగతి ఎలా ఉన్నా పీస్ఫుల్గా ఉంటది. కార్ని మూడు రోజులు రెంట్కి తీస్కోవడం కంటే అక్కడికెళ్ళి రావడం బెటర్. నువ్ కలవాల్సిన మనుషుల్ని ఎప్పుడైనా కలవొచ్చు. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండటమే చాలా ఇంపార్టెంట్. సరేనా? ఇంత ఏకాంతం కూడ మళ్ళీ దొరకదు.

అయినా- కత్తితో పొడిచేంత ధైర్యం ఎట్లా వచ్చిందోయ్ నీకు? ఎక్కడికని పారిపోతావ్? ఎన్ని రోజులని తప్పించుకు తిరుగుతావ్? పెళ్ళి చేస్కున్నోడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. చెప్పినా వినడు. నీకు మనసు ఒప్పుకోపోతే వేరేగా బతకాల్సింది. ఎందుకు ఇంతదాకా తెచ్చుకున్నావ్?

7

ఇదే నా రూం. స్టోర్రూం లా ఉంటది. పర్లేదు. ఈ ఒక్క పూట ఉండు ఇక్కడ. సాయంత్రానికి బయటికెళ్ళిపోదాం. తినడానికి ఏదైనా తెస్తాను. ఈ డైరీలేవి తిరగేయకు. బుద్దిగా కూర్చో. నవ్వకు.

8

గుడ్. స్నానం చేసావ? ఫ్రెష్గా ఉన్నావ్ ఇప్పుడు కాస్త. ఇదిగో మార్చిన డబ్బులు. టికెట్లు. నేను రెండ్రోజులు నీతోనే ఉంటాను. ఊహు. నాకేం భయం లేదు. పద. ఏదైతే అదవుద్ది. ఆ సెల్ఫోన్ ఆన్ చేయకు మళ్ళీ.

9

“నేనూ భరించగలననే అనుకున్నా. ఇదంతా నా బాధ్యతేమో, అందరూ ఇలాగే బతుకుతున్నారేమో అని కూడా అనుకున్నా. చాలా అంటే చాలా రోజులే ఓర్చుకున్నా. కత్తితో పొడిచేంత కోపం వస్తదని నాక్కూడా తెలీదు.”

ఉన్నట్టుండి వెక్కిళ్ళు. కన్నీళ్ళు. వర్షం వెలిసినట్టు కొన్ని మాటలు. కొంత క్లారిటీ.

10

ఏం కాదులే. దగ్గరికిరా. తిరిగెళ్ళి ఒప్పేసుకోవడంగురించి తర్వాత ఆలోచిద్దాంలేగాని, ఈ రెండు రోజులైనా నీకు నచ్చినట్టు బతుకు. సరే! టికెట్స్ క్యాన్సల్. వైజాగ్ దాక బస్లో వెళ్ళి అక్కడ కార్ తీస్కుందాం.

11

విండో సీట్ నీక్కావాలా?ఒకె.

ఇందాక సగంలో ఆగామనుకుంటా. మంచోడే కానీ మంచోడు కాదా? ఊ… ఒథెల్లో టైపా?

నేను టాం రాంసె టైపులె. వెతుక్కుని మరి తలకి తగిలించుకుంటా నీలాంటోళ్ళని. ఒకటే దెబ్బకి సెటిల్ అయిపోవచ్చుగా.

హా! నిజమే జైల్లో.అరె. నవ్వకూ.

12

రాయట్లేదీమధ్య. స్టక్ అయిపోయున్నా. అబ్బా. ప్లీస్ ఓయ్. వదిలెయ్.

ఊహు. ముద్దిచ్చినా వద్దు. నవ్వకు.

ఏదోటి చెప్పక తప్పదా?

 

“వేగాతి వేగంగా పోతోంది కాలం.అది ఊడ్చుకుపోని మనుషులు నా గదిలో తప్ప ఇంకెక్కడా మిగిల్లేరు.”

 

మనకోసమా? సరె. ఇదే లాస్ట్ మరి.

 

“వెంటాడుతుంది. వేటాడుతుంది.తరిమి తరిమి చంపుతుంది.

నిన్నైనా, నన్నైనా జీవితం ఒంటరిగా వదిలేయదు.”

**** (*) ****