అనగనగా ఊరి చివర ఒక మసీదు. అక్కడే ఒంటరిగా ఒక సాయెబు. ఎక్కడ్నుండి వచ్చాయోగాని, ఒక పావురాల జంటని చూసి అతడికి ముచ్చటేసింది. అవి దిక్కులేక చక్కర్లు కొడుతుంటే బాధేసింది. వాటిని చేరదీసి,తనకి సహాయంగా ఉంటూ, ఏదో ఒక పనిచేస్కొని బతకమని చెప్పెళ్ళాడు. గూడు దొరికినందుకు పసిగువ్వలు చాలా సంబరపడ్డాయ్. మలుపుకున్న కలని మళ్ళీ గీయడం మొదలెట్టాయ్.
ప్రతిరోజూ పావురాళ్ళ కువకువల్తోనే మసీదుకి తెల్లారేది. వాటికి నమాజు చదవడం రాదు!అసలు మతమంటే కూడా తెలీదు!మట్టికి మొక్కి చేతులు జోడించేవి.కలిసి బతికేలా దీవించమని వేడుకునేవి.
పొద్దయ్యాక-గింజలకోసం ఒక్కోటి ఒక్కోదిక్కుకి ఎగిరెళ్ళేవి. పొద్దంతా పనిచేసేవి. అవి రెక్కలు విసిర్తేనే వాటి ప్రపంచమంతా గాలివీచేది. పొద్దుపోయాక-గాలిని కొంచెం దాచుకుని ఏరిన గింజలని లెక్కేసుకుంటూ వెనక్కి మర్లేవి. సడిచేయకుండా పడమటి ఎరుపుని కొంచెం తెల్లటి రెక్కలపై అద్దుకుంటూ, అలిసినా చెరగని చిర్నవ్వుతో ఆకాశాన్ని చూస్తూ నెమ్మదిగా నెమ్మదిగా గూటికిచేరేవి.
తిరిగొచ్చాక-వాటికి ప్రార్ధనల్తో పనుండేది కాదు. తిరిగిన ప్రదేశాల్ని, చూసిన ఆనందాల్ని కథలు కధలుగా చెప్పుకుంటూ ఒకటికిమించి మరొకటి మురిసిపోయేవి. పడిన కష్టాన్నసలే చెప్పుకునేవి కావు. కలిసి ఉన్నందుకు ఆనందించేవి. కలిసే ఉండాలని కోరుకునేవి. రాత్రికి సాయెబు పాడే పాట జోలపాటలా వినిపించేది.
పడుకునేముందు పైకిచూస్తే గోపురం చివరకి, నెలవంక అంచుకి మధ్య ఏమంతదూరం ఉండేది కాదు. ఉన్న కొంచెం దూరాన్ని సందేశాల్తో ఇవి చెరిపేసేవి. మబ్బుపట్టిన రాత్రుల్లో తప్ప-మెరిసే నక్షత్రాల తోడుగా దాదాపుగా ప్రతిరోజు, హాయిగానే నిద్రపోయేవి.
అపుడపుడు తప్పనిసరై ఒకదానికోసం మరొకటి సెలవుకూడా తీసుకునేవి. పిల్లలు ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు. పిల్లలు పావురాల్ని తాకి ఆకాశాన్ని అనుభూతించేవాళ్ళు. పావురాలు కూడా పిల్లలపై వాలి ఆకాశాన్ని అందుకున్నట్టు కలగనేవి. బహుశా,ఆ పిల్లలతో గడపడం మినహా జీవితంలో అవేమి సాధించుకోలేదు.
నాకు తెలిసీ,దిక్కులు మారడం గురించి ఆలోచిస్తూనే వాటి చాలారాత్రులు గడిచిపోయేవి.
ఎప్పుడో ఒకసారి, నక్షత్రాల తోడుకూడా లేని అమవాస్యల్లో ఒకదాన్నొకటి గట్టిగా హత్తుకునేవి. అందులో తప్పెంతో అల్లాకే ఎరుక. ఒకదానిపై ఒకటి సేదతీరినట్టు ఎవ్వరూ చూసిన దాఖల్లాల్లేవు.
సాయెబుకి ఒకరోజు ఏమనిపించిందో-పాపం పాపం అని కేకలేసాడు. ఎవరొచ్చి ఏం చెప్పి ఒప్పించారో- పాపం పాపం అంటూ తోలేసాడు. మళ్ళీ చుట్టుపక్కల కనపడొద్దని మాటకూడా అడిగి తీస్కున్నాడు. అంతే!కధ ముగిసిపోయింది.
ఎగిరిపోవడం కొత్తకాదుగాని, ఇప్పటికీ అవెటెల్లాయో తెలీదు. రాల్చుకున్న ఈకలు రక్తపు మరకలు తప్ప గుర్తుగా అవేమి వదల్లేదు. సాయెబు వాటిని వెతుక్కుంటు పోయాడు. మళ్ళీ రాలేదు. మసీదు ఒక్కతైపోయింది.
గోపురం చివరకి, నెలవంక అంచుకి రోజురోజుకి దూరం పెరిగిపోతుంది.
చాలా బాగుంది నందు.
యంగ్ అండ్ అప్కమింగ్ రచయితవి నువ్వు, డియర్ నందు.
చాలా బాగా రాసావు. పోయటిక్ టింజ్ ఉంది నీలో పుష్కలంగా..!
అల్ ద బెస్ట్ నందూ…!!
-భాస్కర్ కూరపాటి.
కవితాత్మకమైన కథ చాల రోజులైంది. మంచి అనుభూతి ఉంది ఈ కథ లో. నేను ఈ కథ చదివి నెల కావస్తుంది. ఈ వెబ్ సైట్లో ఇలాంటి మీ కథల కోసం చాలా వెతికాను. దొరకలేదు. మరిన్నిమంచి కథలు మీ కలం నుండి రాలాలని మా విన్నపం.