కవిత్వం

అనుకోకుండా 36

జనవరి 2016

లా ముగించాలో తెలీదు. అక్షరం కదిలిపోకుండా, చేతులు వణికిపోకుండా, ఊపిరి అదుపుతప్పి దిగమింగుకున్న దుఃఖం ఒలికిపోకుండా

వెన్నెలస్నేహితా!

సమస్త జీవరాశికి ఒక ఆత్మ ఉన్నందుకు, దాని శరీరాన్ని నీకూ నాకూ సమంగా పంచి ఇచ్చినందుకు- దగ్గరగా, ఇంత దగ్గరగా, నేనంటూ లేనంత దగ్గరగా నిన్ను చేరుకున్నందుకు దుఃఖం.

సమస్త శూన్యానికి ఒక దేహం ఉన్నందుకు, దాని దేహం అనంతమంతా విస్తరించి ఉన్నందుకు- దూరంగా, ఇంత దూరంగా, నువ్వసలే కనపడనంత దూరంగా నిన్ను విసిరేసినందుకు దుఃఖం. మనల్ని చెల్లా చెదురు చేసినందుకు దుఃఖం.

వెన్నెలస్నేహితా!

రాళ్ళే మిగిలుంటాయ్. ఇక్కడ, మనిషిగా మాట్లాడలేని, పశువుగా సంచరించలేని, పువ్వుల నీడలో రమించలేని శాపగ్రస్త లోకంలో-

తడిరాళ్ళమీది మెరుపుల్ని ఏరినందుకు, తళుక్కుమన్న నదులమీద గలగలా నవ్వినందుకు ఇది శిక్ష. దుఃఖించే ప్రతీ సంధ్యలో దూరంగా పారిపోనందుకు శిక్ష. దిగంతందాటి ఎగిరినందుకు, ఆకాశాన్ని ధిక్కరించినందుకూ ఇది శిక్ష.

వెన్నెలస్నేహితా!

నిస్త్రాణమైన క్షణాలలోనూ, నీ ప్రాణం ఊగిసలాడిన నిమిషాలలోనూ మృత్యువునుండి కొంత జీవితం సమీకరించినందుకు, ఊపిరినుండి కొంతకాలం అడిగి తీసుకున్నందుకు ఇది శిక్ష.

వెన్నెలస్నేహితా!

కధలే మిగిలుంటాయ్. ఎంతగా ప్రేమించుకున్నా,ఎంతగా దహించుకున్నా,శిధిలమైన ప్రతీ గుర్తుని ఎంత అపురూపంగా దగ్గరికి తీసుకున్నా-

చెట్లు ఆకుల్ని వొలుచుకోవడానికి, అమ్మలు పిల్లల్ని వొదులుకోవడానికి మనం బాధ్యులం.రాసుకున్న ప్రతీ అక్షరం రగిలిపోవడానికి, కూర్చుకున్న రంగులన్నీ చెదిరిపోవడానికి మనం బాధ్యులం. పక్షులు రెక్కల్ని విసర్లేక, ప్రాణం దేహాల్ని వీడిపోవడానికి మనం బాధ్యులం.

వెన్నెలస్నేహితా!

ఎలా ముగించాలో తెలీదు. హృదయం లయ తప్పకుండా, పాట స్వరం తప్పకుండా, ఊపిరివృత్తంనుండి విసిరేయబడకుండా-

ఒకే భూమ్మీది రెండు ధృవాల మధ్య నిలువుగా పాతుకున్న క్షితిజరేఖగురించి, ఒకే ఆకాశంలోని రెండు నక్షత్రాల మధ్య చిక్కగా పరుచుకున్న చీకటిగురించి, మన ప్రేమగురించి..

ఏం మిగిలింది ఇంకా రాయడానికి? సెలవు.